ఓట్లు లెక్కించేందుకు సర్వం సిద్ధం: సీఈవో 

18 May, 2019 02:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు  ఈ నెల 23న ఓట్లు లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 82 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు మొత్తంగా 1,841 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నట్లు వివరించారు. 110 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్‌లో 15 (14+1) టేబుళ్లను, నిజామాబాద్‌లోని 7 సెగ్మెంట్లలో 19 (18+1) టేబుళ్లను, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్‌బీనగర్‌లోని 2 సెగ్మెంట్లలో 29 (28+1) టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డీఈవో ఉంటారని వివరించారు. వీరితోపాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారని, మొత్తం 6,745 మంది లెక్కింపులో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని పేపర్‌ స్లిప్పులను కూడా లెక్కిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల ప్రకటన 3 గంటలు ఆలస్యం కావొచ్చని రజత్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు