కాలేజీల ఫీజులుం!

8 May, 2019 04:10 IST|Sakshi

బకాయిలతో పాటు పెంచిన ఫీజులు చెల్లించాలంటున్న కాలేజీలు

తక్షణమే ఆ మొత్తం చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి

ప్రఖ్యాత కాలేజీల్లో విద్యార్థులకు వరుస ఎస్‌ఎంఎస్‌లు

ఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనలు దాటి వసూళ్లు చేస్తున్న వైనం

వ్యక్తిగతంగా ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లిస్తామంటూ సతాయింపు

నిధుల విడుదలలో జాప్యంతో హామీ పత్రాలిస్తున్న సంక్షేమ శాఖలు

దీప్తి గండిపేట సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. కన్వీనర్‌ కోటాలో సీటు రావడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హత సాధించింది. తొలి ఏడాది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించగా, రెండో ఏడాది కూడా అదే తరహాలో మార్కులు సాధించేందుకు సన్నద్ధమైంది. అకస్మాత్తుగా దీప్తి సెల్‌ఫోన్‌కు కాలేజీ నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. రూ.2.79లక్షలు ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామని స్పష్టం చేయడంతో ఆమె గుండె ఆగినంత పనైంది.

వాస్తవానికి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం కింద దీప్తి ట్యూషన్‌ ఫీజంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్ర యించి ట్యూషన్‌ ఫీజు పరిమితిని అమాంతం పెంచేసింది. దీంతో కాలేజీ నిర్దేశించిన ఫీజును చెల్లించాలని విద్యార్థులకు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ పెంపుతో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.83 వేల భారం పడుతోంది.

ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు గుబులు పట్టుకుంది. కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో ట్యూషన్‌ ఫీజును ఖరారు చేస్తూ విద్యార్థులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. పెంచిన ఫీజును చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఒత్తిడి తెస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే పరీక్ష లకు అనుమతిస్తామని స్పష్టం చేస్తూ హాల్‌టికెట్లు ఇచ్చేందుకు సతాయిస్తున్నాయి. చివరి నిమిషం వరకు కాలేజీ యాజమాన్యం తీరు మారకపోవడంతో విద్యార్థులు అప్పులు చేసి మరీ ఫీజు బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతోంది.

ఎస్‌ఎంఎస్‌లతో హెచ్చరికలు..
ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ఆ భారాన్ని విద్యార్థులపైకే నెడుతున్నాయి. సాధారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల వార్షిక సంవత్సరం ముగిసే వరకు విడతల వారీగా జరుగుతుంది. ఈక్రమంలో 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు ఇవ్వాలంటే వ్యక్తిగతంగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ కాలేజీలైతే ఏకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు వరుసగా సందేశాలు పంపి హెచ్చరిస్తున్నాయి. టాప్‌ కాలేజీ యాజమాన్యాలు వరుసగా బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను పంపించి విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. 

వాస్తవ బకాయిలకు భిన్నంగా...
ఎస్‌ఎంఎస్‌లు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఒకేసారి రూ.లక్షల్లో బకాయిలు ఉండటంపై ఆరా తీసి అవాక్కవు తున్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ సమయంలో నిర్దేశించిన ఫీజు కాకుండా అధిక మొత్తంలో ఫీజును చూపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండిపేట సమీపంలోని ప్రఖ్యాత కాలేజీ ఫీజు అడ్మిషన్‌ సమయంలో 1.16 లక్షలుగా ఉంది. ప్రస్తుత రికార్డు ప్రకారం రూ.2 లక్షలకు పెరిగింది.

ఏకంగా 83,500 పెరగడంతో ఆమేరకు విద్యార్థి ఫీజు బకాయిలో జమచేస్తున్నారు. ఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫీజు పెంపు జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. ఘట్‌కేసర్‌ సమీపంలోని మరో ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రవేశాల సమయంలో ట్యూషన్‌ ఫీజు రూ.97 వేలు చూపగా.. ప్రస్తుతం 1.37లక్షలుగా కాలేజీ యాజమాన్యం నిర్ధారించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన ఫీజునే చెల్లిస్తామని సంక్షేమ శాఖలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పెంచిన మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరి భరించాల్సి వస్తోంది.

ఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారమే ఫీజులు
‘దరఖాస్తుల పరిశీలన తర్వాత ఫీజులు విడుదల చేస్తున్నాం. చాలా కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తులను పంపడంలో జాప్యం చేస్తున్నాయి. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత హార్డ్‌ కాపీలను మాకు సమర్పి స్తేనే వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు వెరిఫైడ్‌ డిమాండ్‌ 1,037.49 కోట్లుంటే.. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం. కొన్ని కాలేజీలు ఏఎఫ్‌ఆర్‌సీ (ప్రవేశాలు, ఫీజుల క్రమబద్ధీకరణ కమిటీ)కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.

ప్రత్యేక అనుమతితో ఆమేరకు ఫీజులు పెంచి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారమే ఫీజు చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో కూడా పెండింగ్‌లో ఉంది. కోర్టు తీర్పు వచ్చాక ఆ మేరకు ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతా కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నాం. యాజమాన్యాలతో క్రమం తప్పకుండా మాట్లాడు తున్నాం. లేఖలు రాస్తున్నాం..’     – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు

>
మరిన్ని వార్తలు