వరికి మద్దతు ధర రూ. 3,650

8 Jun, 2019 02:05 IST|Sakshi

కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ సూచన 

సాగు ఖర్చు ఆధారంగా స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారం అమలు చేయాలని విన్నపం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతుల సాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని, వ్యయానికి తగ్గట్టు వాటిని పెంచాలని భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ)ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. రబీ పంటలకు రైతులు పెట్టే ఖర్చుల వివరాలు నివేదిస్తూ వాటికి ఇవ్వాల్సిన మద్దతు ధరలను కమిషన్‌కు సిఫారసు చేసింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ఫ్రతిఫలం తదితరాలన్నీ మదింపు చేసిన ఈ నివేదికను హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సీఏసీపీ సమావేశంలో సమర్పించారు. ఈ సమావేశంలో సీఏసీపీ చైర్మన్‌ విజయ పాల్‌ శర్మ, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి కమిషనర్‌ రాహుల్‌ బొజ్జ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్వింటా సాధారణ వరి పండించాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ. 2,433గా రాష్ట్ర వ్యవసాయాధికారులు నిర్ధారించారు.

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇవ్వాలని సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. ఆ సూత్రం ప్రకారం 2019–20 రబీ వరికి క్వింటాకు రూ.3,650 ఇవ్వాలని కోరింది. మొక్కజొన్న, శెనగ, వేరుశెనగ పంటలకు కూడా ఖర్చు, ఎంఎస్‌పీని పేర్కొంటూ సమగ్ర నివేదికను తయారు చేసింది. అలాగే మొక్కజొన్నకు క్వింటా పండించేందుకు రూ.3,104 ఖర్చు అవుతుందని నిర్ధారించారు. ఎంఎస్‌పీ రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్నకు రూ.1,700 ఎంఎస్‌పీ ఉంది. వేరుశెనగ క్వింటా పండించేందుకు రూ.5,148 ఖర్చు అవుతుండగా, క్వింటాకు ఎంఎస్‌పీ రూ.7,700 ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరింది.

ఇక క్వింటా శెనగ పండించేందుకు రూ. 5,222 వ్యయం అవుతుండగా, మద్ధతు ధర రూ.7,800 ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటా శెనగకు రూ.4,620 ఉంది. సాగు సహా ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్రం విఫలమవుతోందని అధికారులు చెబుతున్నారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ, ఏపీ రైతు ప్రతినిధులు వరికి గోధుమ పంటతో సమానంగా మద్దతు ధర కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్ర రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల హెక్టార్లు పైగా విస్తీర్ణంలో మక్కలు పండిస్తున్నందున వాటికి మద్దతు ధర గతంలో లాగానే ప్రకటించాలని కోరారు. తమిళనాడు రైతు ప్రతినిధులు మాట్లాడుతూ శెనగలకు ఇప్పుడున్న క్వింటాలుకు రూ. 4,620 నుంచి రూ.6,000 పైగా ప్రకటించాలని కోరారు.

మరిన్ని వార్తలు