‘సైలెంట్‌ సపోర్ట్‌’ను గుర్తించలేకపోయాయి

13 Dec, 2018 03:46 IST|Sakshi

సురవరం సుధాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ‘సైలెంట్‌ సపోర్ట్‌’ను విపక్షాలు సరిగ్గా గుర్తించలేకపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలున్నా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఎన్నడూ లేనివిధంగా డబ్బు ఖర్చు చేయడం, మద్యం పంపిణీ తదితర అంశాలన్నీ కలిసి కేసీఆర్‌ గెలుపునకు కారణమయ్యాయని బుధవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పింఛన్లు, రైతుబంధు, గొర్రె ల పంపిణీ తదితర పథకాలు కాంగ్రెస్‌ అనుకూల ఓటింగ్‌కు గండికొట్టాయని అభిప్రాయపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం, కూటమి విధానాలు, తదితర అంశాలపై ప్రచారానికి 10– 15 రోజుల సమయం లేకపోవడం కూటమి ఓటమి కారణాలుగా చెప్పారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా తగ్గిపోవడం స్పష్టంగా కనిపించిందన్నారు.  

‘ఫలితాలను అంచనా వేయలేకపోయాం’
సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణ ఎన్నికల ఫలితాలను తాము అంచనా వేయలేకపోయామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయ ణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కి తెలంగాణ సెంటిమెంట్, పలు సంక్షేమ పథకాలు లాభించడంతో కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగలిగారన్నారు. అందుకే గతంకంటే టీఆర్‌ఎస్‌కు ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయన్నారు. కూటమి ఏర్పాటులో ఆలస్యం కావడం, కూటమి కుదిరినా పై స్థాయిలో నాయకులు కలసినట్టు కింది స్థాయిలో ప్రజలు కలవలేకపోయారన్నారు. కూటమిలో ఎక్కడ తప్పులు జరిగాయో పరిశీలించుకొని ముందుకెళ్తామన్నారు. 

మరిన్ని వార్తలు