కావేరికి దారేదీ?

23 Dec, 2017 02:24 IST|Sakshi

ఎన్‌డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం ప్రతిపాదనలపై అనుమానాలు

అకినేపల్లి–సాగర్‌ అనుసంధానంతో ఒనగూరే ప్రయోజనం స్వల్పమే

నీటి పారుదల శాఖ వర్గాల అంచనా ∙మిగులు జలాలపై తేల్చలేదు..

అకినేపల్లి బ్యారేజీ ముంపుపై అధ్యయనం చేయలేదు..

తుపాకులగూడెం నుంచి ఉదయ సముద్రం ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం

అలా కాకుండా గోదావరి నీటిని తమిళనాడుకు తరలించడమేంటి?

నిపుణుల విస్మయం.. త్వరలోనే కేంద్రం వద్దకు..

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న అకినేపల్లి–నాగార్జునసాగర్‌ అనుసంధానంతో తెలంగాణకు ఒనగూరే ప్రయోజనం స్వల్పమేనని నీటి పారుదల శాఖ భావిస్తోంది. మహానది మిగులు జలాలపై తేల్చకుండా, అకినేపల్లి బ్యారేజీ నిర్మాణం ముంపుపై శాస్త్రీయ అధ్యయనం చేయకుండా, రాష్ట్ర అవసరాలను గుర్తించకుండా గోదావరి నీటిని తమిళనాడుకు తరలించడం తమకేమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తోంది. దీనిపై త్వరలోనే తన అభిప్రాయాన్ని కేంద్రానికి నివేదించనుంది.

మహానది నీళ్లు లేకుండా మిగులెక్కడ?
మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరిలను అనుసంధానించే ప్రక్రియను కేంద్రం మొదలు పెట్టగా.. దక్షిణాది రాష్ట్రాల నదుల్లో ఎగువన ఉన్న ఒడిశానే దీనికి అనేక అభ్యంతరాలు తెలిపింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నాయన్న లెక్క తప్పని, మహానది–గోదావరిల అసునంధానంతో తమ పరీవాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని స్పష్టం చేసింది.

దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. మహానది నుంచి ఎంతమేర మిగులు జలాలను గోదావరికి తరలిస్తారన్నది స్పష్టం చేయకుండా ప్రాణహిత, గోదావరి, ఇంద్రావతులు కలిసే ప్రాం తానికి దిగువన అకినేపల్లి నుంచి నీటిని తరలిస్తామని ప్రతిపాదన తెచ్చింది.దీనిపై తెలంగాణ నీటి పారుదల అధికారులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహానది మిగులు జలాలు ఏ మేరకు గోదావరికి వస్తా యో తెలపకుండా కేవలం గోదావరిలో మిగు లు జలాలను తరలిస్తామనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో లభ్యంగా ఉన్న 954.2 టీఎంసీల నీళ్లు రాష్ట్ర అవసరాలకే సరిపోతా యని తెలంగాణ చెబుతోంది.

గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న నీటిలో నిర్మితమైన, నిర్మితమవుతున్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టుల్తో కలిపి మొత్తంగా 684 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోనున్నారని, మిగతా 270 టీఎంసీలు మిగులు జలాలేనని ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతున్న లెక్కలను తప్పుపడుతోంది. రాష్ట్రానికి ఉన్న వాటా 954.2 టీఎంసీలకు తమ వద్ద ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయని స్పష్టం చేసింది. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీలు వినియోగంలో ఉండగా, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా భవిష్యత్‌ కార్యాచరణ ఉందని చెబుతోంది. మరి అలాంటప్పుడు మిగులు జలాలు ఎక్కడి నుంచి వస్తాయని అధికారులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ముంపు ఎందుకు ఉండదు?
ప్రస్తుత కేంద్ర ప్రతిపాదనలో భాగంగా గోదా వరి నదిపై అకినేపల్లి వద్ద 590 మిలియన్‌ క్యూ బిక్‌ మీటర్ల నిల్వ సామర్థ్యంతో అంటే 20 టీఎంసీల సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. ఈ బ్యారేజీలో 12 వేల హెక్టార్లు (30 వేల ఎకరాలు) భూమి ముంపునకు గురవుతుంది.

ఈ భూమి అంతా నదీ గర్భంలోనే ఉంటుంది కాబట్టి ముంపు సమస్య ఉండదని ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతోంది. దీనిపై తెలంగాణ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 16 టీఎంసీలతో మేడిగడ్డ, 6.94 టీఎంసీల తో తుపాకులగూడెం వంటి బ్యారేజీలను గోదావరిపైనే కడుతుంటే అక్కడ నదీ గర్భం తో సంబంధం లేకుండా వందల ఎకరాల భూసేకరణ అవసరం అవుతోంది. అలాంటిది 20 టీఎంసీలతో కడితే ముంపు లేదనడం ఆశ్చ ర్యంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే..
గోదావరిపైనే తెలంగాణ నిర్మిస్తున్న తుపాకుల గూడెం నుంచి ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజ్‌–2 కింది 7.50 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు, ఉదయ సముద్రం కింద మరో లక్ష ఎకరాలు, ఏఎమ్మార్పీ ద్వారా 80 వేలు, నాగార్జునసాగర్‌ కింద నల్లగొండ జిల్లాలోని 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అం దించే అవకాశముందని రాష్ట్ర అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. అలాకాకుండా తెలంగాణ, ఏపీల మధ్య పొత్తు పెట్టేలా సాగ ర్‌కు నీటిని తరలించడం, అక్కడి నుంచి కావే రికి నీటిని తరలించడం సరికాదని పేర్కొంటు న్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే ప్రక్రి య మొదలుపెట్టాలని స్పష్టం చేస్తున్నారు.

లభ్యతపైనా అనుమానాలు..
అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలు పోనూ 50% నీటి లభ్యత (డిపెండబులిటీ) ఆధారంగా 8,194 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత (డిపెండబులిటీ) ఆధారంగా 12,104 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (427 టీఎంసీలు) మిగు లు ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది. ఈ అంచనా కూడా తప్పుల తడకగా ఉందని, 50% నీటి లభ్యతతో పోలిస్తే 75% నీటి లభ్యత తక్కువగా ఉండాలని, కానీ ఇక్కడ తారుమారుగా చెప్పడంపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  


‘అనుసంధానం’పై అధ్యయనం
అధికారులకు మంత్రి హరీశ్‌ ఆదేశం
గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. నదుల అనుసంధానంపై కేంద్రం మొండి పట్టుదలతో ఉండటం, ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు.. అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, రిటైర్డ్‌ ఇంజనీర్లతో మాట్లాడారు.

లాభనష్టాలను బేరీజు వేసి ఓ ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి మిగులు జలాల అంశాన్ని, ముంపును, తెలంగాణకు అనుసంధానంతో దక్కే అదనపు ప్రయోజనాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీంతో అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం తన పని ప్రారంభించింది. కంతనపల్లి దిగువన నీటి లభ్యత, ప్రస్తుతం చేసిన ప్రతిపాదనకు భిన్నంగా తెలంగాణకు మరింత లాభించే ప్రత్యామ్నాయాలపై చర్చలు ప్రారంభించింది.

మరోవైపు రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం శనివారం భేటీ కావాలని నిర్ణయించింది. పాత దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ నుంచి సాగర్‌ అనుసంధాన నిర్ణయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ యావత్తూ వ్యతిరేకించిన నేపథ్యంలో.. ప్రస్తుత ప్రతిపాదనలను పూర్తిగా వ్యతిరేకిస్తుందా? లేక ప్రత్యామ్నాయాలు కోరుతుందా? వేచి చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు