ఐదో రోజూ.. అదే తీరు! | Sakshi
Sakshi News home page

ఐదో రోజూ.. అదే తీరు!

Published Sat, Dec 23 2017 2:25 AM

Winter Session Of Parliament - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రధాని మోదీ చేసిన కుట్ర ఆరోపణలపై శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపిన తర్వాతే సభ జరగాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టగా ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

రాజ్యసభలో...
శుక్రవారం ఉదయం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య జీరో అవర్‌తో కార్యకలాపాలను ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్‌ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో వెంకయ్య  సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైన తర్వాత కాంగ్రెస్‌ నేతలు ఆజాద్, ఆనంద్‌ శర్మ లేచి తాము సభలో గొడవచేయాలనుకోవట్లేదని ‘కుట్ర వ్యాఖ్యల’ వివాదానికి ముగింపు దొరికేదాకా సభను వాయిదా వేయాలని కోరారు. చైర్మన్‌ స్పందిస్తూ సభ కొనసాగటం సభ్యులకు ఇష్టం లేనందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

లోక్‌సభలో...
మోదీ క్షమాపణ చెప్పాలంటూ శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయిన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేసుకుంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. 2జీ స్కాంపై బీజేపీ చేసిన ఆరోపణలకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నినాదాల హోరు మధ్యనే స్పీకర్‌ మహాజన్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని  కొనసాగించారు. ఓక్కి తుపాను బాధిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత ఖర్గే మాట్లాడుతూ.. ఓక్కితో తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు 4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను, తమిళనాడుకు మూడింటిని పంపిన కేంద్రం.. అంతగా ప్రభావం లేని గుజరాత్‌కు మాత్రం ఏడు బృందాలను పంపడమేంటని ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి రాజ్‌నాథ్‌  సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. మధ్యాహ్నం జీరో అవర్‌ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌ నేత  ఖర్గే మాట్లాడుతూ ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నా మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ తమ సభ్యులతోపాటు సభ నుంచి వాకౌట్‌ చేశారు. క్రిస్‌మస్‌ సెలవుల నేపథ్యంలో పార్లమెంట్‌ తిరిగి

బుధవారం సమావేశం కానుంది.
పోషకాహార మిషన్‌కు ఆధార్‌ తప్పనిసరి
జాతీయ పోషకాహార మిషన్‌ లబ్ధిదారులైన బాలలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అరుణ్‌కుమార్‌ లోక్‌సభకు తెలిపారు. లబ్ధిదారులకు సులువుగా ప్రయోజనాలు అందించేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా జీఎస్టీ సవరణ (రాష్ట్రాలకు పరిహారం అందించే) బిల్లును ఆర్థిక మంత్రి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం పరిహారమిస్తుంది. వివాదాస్పద ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూ్యరెన్స్‌ (ఎఫ్‌ఆర్డీఐ), 2017 బిల్లుపై నివేదిక సమర్పణకు రాజ్యసభ చైర్మనును సెలెక్ట్‌ కమిటీ చైర్మన్‌ భూపేంద్ర మరింత సమయం కోరారు.

క్రీడాకారులకు ఆర్థిక భద్రత కల్పించండి
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి క్రీడాకారులకు ఆర్థిక భద్రత కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సచిన్‌ ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్‌ క్రీడాకారుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. రాజ్యసభలో గురువారం కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన కారణంగా ఆయన మాట్లాడలేకపోయిన విషయం విదితమే. ఆ ప్రసంగ పాఠాన్ని శుక్రవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో విడుదల చేశారు. క్రీడలనే కెరీర్‌గా మలచుకునే ఆటగాళ్లకు ఆర్థిక భరోసా పెద్ద సమస్యగా మారిందని, దీంతో వారు క్రీడలపై పూర్తి సమయాన్ని, సామర్థ్యాన్ని వినియోగించుకోలేక పోతున్నారన్నారు. ఆర్థిక భరోసాతోపాటు క్రీడాకారులకు ఆరోగ్య బీమా కూడా అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రముఖ క్రీడాకారుల జీవితాలను పాఠ్యాంశాలుగా చేయాలని తెలిపారు. సీనియర్‌ క్రీడాకారులను వినియోగించుకుని విద్యార్థుల్లో పాఠశాల దశలోనే క్రీడా ప్రావీణ్యాలను వెలికి తీసి శిక్షణ ఇప్పించాలన్నారు.

Advertisement
Advertisement