తాండూరు రూరల్‌ సీఐ  సైదిరెడ్డి సస్పెన్షన్‌ 

1 Aug, 2018 08:52 IST|Sakshi
సీఐ చింతల సైదిరెడ్డి

ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర

విధుల్లో అలసత్వం

బాధ్యతా రాహిత్యమే కారణమని వెల్లడి

తాండూరు వికారాబాద్‌ : తాండూరు రూరల్‌ సీఐ చింతల సైదిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అదే రోజు రాత్రి సీఐ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం చేవెళ్ల సీఐగా పనిచేసిన ఈయన బదిలీపై తాండూరుకు వచ్చారు. 5 నెలల క్రితం తాండూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని పెన్నా సిమెంట్స్‌ టౌన్‌షిప్‌లో భారీ చోరీ జరిగి రూ.కోటికి పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది.

సీఐ ఇంతవరకూ ఈ కేసును ఛేదించలేకపోయారు. అధికార పార్టీ అండ ఉందనే అతి విశ్వాసంతో ఇతర పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేశారని, పలు కేసుల్లో అమాయకులను వేధించారని ఈయనపై ఆరోలున్నాయి. రూరల్‌ పరిధిలో కాగ్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అండగా నిలిచారనే అభియోగాలున్నాయి. అంతే కాకుండా యంగ్‌ లీడర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డితో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శలు ఎదుర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలపై అకారణంగా కేసులు పెడుతూ పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారంటూ టీజేఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఈయనపై ఇటీవలే  డీజీపీ, ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సాక్షి కథనంతో  స్పందించిన అధికారులుపోలీస్‌ వర్సెస్‌ ఇంటెలిజెన్స్‌ శీర్షికతో గత నెల 23న సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తావద్ద ఇటీవల పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారుల మధ్య జరిగిన గొడవపై స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు వివరాలు సేకరించారు. గత నెల 19న పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది వాస్తవమేనని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.రూరల్‌ సీఐ సైదిరెడ్డి ఎదుట గొడవ జరిగినా.. ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని, గొడవ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయకపోవడంతో అతనిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు