టీబీ @ టీనేజ్‌

26 Aug, 2019 01:44 IST|Sakshi

నగరంలో చాపకింద నీరులా విస్తరణ

పోషకాహారలోపం వల్లే

సాక్షి, హైదరాబాద్‌ : టీనేజ్‌ యువతపై టీబీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ట్యూబరిక్లోసిస్‌(టీబీ) చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ బాధితులు, చిన్నారుల్లోనే కాదు, టీనేజీ అమ్మాయిల్లోనూ ఇది వెలుగుచూస్తోంది. జనసమూహం ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడం, పోటీ పరీక్షల పేరుతో పెరుగుతున్న ఒత్తిడికి తోడు ఆశించినస్థాయిలో పౌష్టికాహారం అందకపోవడంతో రోగ నిరోధకశక్తి తగ్గుతోంది. మరి కొంతమంది ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో కాలేజీకి బయలుదేరి, మధ్యాహ్నం క్యాంటీన్లో రెడీమేడ్‌ ఫుడ్‌తో కడుపు నింపుకోవడం ద్వారా పౌష్టికాహారలోపం ఏర్పడుతోంది.

దీంతో చాలామంది టీబీ బారిన పడుతున్నారు. బంధువర్గాల్లో తెలిస్తే వివాహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించి, గుట్టుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయిస్తున్నారు.  రోగుల వివరాల నమోదుకు ప్రైవేటు ఆసుపత్రులు సహకరించడంలేదు. క్షయవ్యాధి బారిన పడ్డవారు ఒకట్రెండు నెలలపాటు మందులు వాడి ఆ తరవాత వైద్యఖర్చులకు భయపడి మందులు వాడ కుండా మానేస్తున్నారు. వ్యాధి మరింత ముదిరిపోయి, ఇతరులకు సులభంగా వ్యాపిస్తోంది. నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

గ్రేటర్‌లో విస్తరిస్తున్న వైనం
నగరాన్ని ఓవైపు స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడు ఆ స్థానాన్ని ట్యూబరిక్లోసిస్‌(టీబీ) ఆక్రమించింది. టీబీ సంబంధ సమస్యతో బాధపడుతూ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులసంఖ్య గత మూడేళ్లతో పోలిస్తే మూడింతలు పెరిగింది. 2015లో ఆస్పత్రికి చికిత్స కోసం 80 వేలమంది రాగా, 2018లో 1.72 లక్షల మంది చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. వీరిలో 20 శాతానికి మించి టీనేజీ యువత ఉన్నారు. దేశంలో ఏటా మూడు లక్షల మంది ప్రజలు టీబీతో చనిపోతున్నారు. ప్రతిరోగి తను చనిపోయే ముందు మరో 15 మందికి వ్యాపింపజేస్తున్నాడు. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

లక్షణాలు గుర్తించవచ్చు ఇలా.. 

  • సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం.
  • ఆకలి, బరువు తగ్గడం, నీరసంగా, ఆయాసం, ఛాతీలో నొప్పి ఉంటుంది.
  • తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు.
  • ఆరు నుంచి తొమ్మిది మాసాలపాటు మందులు వాడాలి. 
  • బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి.
  • బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగి ఉండాలి. 

పౌష్టికాహారం, వ్యాయామం అవసరం 
సాధారణంగా ప్రతి మనిషిలోనూ టీబీ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో త్వరగా బయటపడుతుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే టీనేజీ అమ్మాయిల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చుకోవడం, వ్యామాయం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగు పర్చుకుని వ్యాధిభారినపడకుండా చూసుకోవచ్చు.
- డాక్టర్‌ రఫీ, ఫల్మొనాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు