నీకు చదువెందుకురా..పెళ్లి చేసుకో!

18 Oct, 2017 03:36 IST|Sakshi
తండ్రి వాసుతో ముత్యాలరాజు

బడి నుంచి పంపించేశారంటూ వికలాంగ విద్యార్థి ఆవేదన 

సత్తుపల్లి రూరల్‌: ‘ప్రైవేట్‌ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు..’ అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది.. అయితే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వికలాంగ విద్యార్థి సంపంగి చిలకల ముత్యాలరాజుకు ఎదురైన అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సోమవారం ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లగా.. కొందరు ఉపాధ్యాయులు నీవు వికలాంగుడివి.. నీకు చదువెందుకురా? నిన్ను స్కూల్‌లో నుంచి తీసివేశాం.. నీవు ఇంటికి వెళ్లు.. అని పంపించారని విలేకరులకు తెలిపాడు. అంతేకాకుండా నీ వయసుకు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండు.. నీకు వచ్చే వికలాంగ పింఛన్లతో నీవు, నీ భార్య బతకండి.. అని హేళనగా మాట్లాడారని వాపోయాడు.

విషయాన్ని మంగళవారం తన తండ్రి వాసుకు చెప్పాడు. తండ్రి వాసు విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరుడి కొడుకును కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని, అతడు ఇప్పుడు పాఠశాలకు వెళ్లకుండా మామిడి తోటలు నరికే పనికి వెళ్తున్నాడని.. ఇలా ఉపాధ్యాయులు పేద పిల్లలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించాడు. తమ పిల్లలను అవమానపరిచేలా మాట్లాడిన ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సత్తుపల్లి ఎంఈవో, డీఈవో, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. ఈ విషయమై ఎంఈవో బి.రాములును వివరణ కోరగా.. విద్యార్థి తండ్రి వాసు ఎంఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడని.. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.     

మరిన్ని వార్తలు