అంగన్‌వాడీలకూ పీఆర్సీ ఫలాలు

2 Oct, 2023 03:44 IST|Sakshi

మిగతా డిమాండ్లనూ పరిశీలించి పరిష్కరిస్తాం: మంత్రి హరీశ్‌రావు 

అంగన్‌వాడీ ఉద్యోగుల జేఏసీ నేతలతో భేటీ 

డిమాండ్లపై నివేదిక సమర్పించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నా­రు. ఆదివారం అంగన్‌వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతి­ని­ధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశా­రు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు.

దీనిపై హరీశ్‌ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వను­న్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్ర­భుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచు­తామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సా­నుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పా­ఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చే­సిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చే­స్తామని మంత్రి హరీశ్‌ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు