డేంజర్ ఫైట్...

11 May, 2015 02:35 IST|Sakshi
డేంజర్ ఫైట్...

నిండు ప్రాణాన్ని బలిగొన్న వీధి పోరు
పాతబస్తీలో విషాదం
బైక్ యాక్సిడెంట్‌గా నమ్మించిన స్నేహితులు
వాట్సాప్ వీడియో ద్వారా బయటపడ్డ ఘటన
పోలీసుల అదుపులో నిందితులు

హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లోని పెడధోరణులు హైదరాబాద్ యువతలో బుసలు కొడుతున్నాయి. విదేశాల్లోని స్ట్రీట్‌ఫైట్ విష సంస్కృతి ఇక్కడా జడలు విప్పింది. చివరకు ఓ నిండు ప్రాణాన్నే బలిగొంది. హైదరాబాద్ పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధం ఒకరిని మృత్యుఒడికి చేర్చింది.

ఒక కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మీర్‌చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మీరాలం మండి పోలీస్ లేన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ దస్తగిర్ కుమారుడు నబీల్ (17) ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. ఈ నెల 3నఫజర్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 గంటలకు ఫంజేషాలోని ఇండో-అమెరికన్ స్కూల్ వద్దకు నబీల్‌తోపాటు అతని స్నేహితులు మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), ఉమర్ బేగ్ (20), సుల్తాన్ మీర్జా (22), ఇర్ఫాన్ పఠాన్ (22), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (31), అబూబకర్ (19), మరో ఇద్దరు యువకులు చేరుకొని స్ట్రీట్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. గెలిచే వ్యక్తి మిగతా వాళ్లకు బిర్యానీ తినిపించాలని షరతు పెట్టుకున్నారు.

ఈ పోరుకు ఓ యువకుడు రన్నింగ్ కామెంటరీ చేయగా, డాలర్ వసీం రెఫరీగా, ఉమర్ బేగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహ్మద్ ఒవేస్‌తో మొదటగా అబూబకర్ తలపడ్డాడు. అబూబకర్ మట్టి కరవడంతో లూజర్...లూజర్ అంటూ రన్నింగ్ కామెంట్రీ చేసిన యువకుడు ఆట పట్టించాడు. వెంటనే ఒవేస్‌తో మరో యువకుడు సుల్తాన్ ఫైట్ చేశాడు. ఫైట్ చేస్తుండగానే సుల్తాన్ చొక్కా చిరగడంతో లూజర్ అంటూ అతన్ని కూడా కామెంట్ చేశాడు. మూడో ఫైటర్‌గా ఓవేస్‌తో తలపడేందుకు స్నేహితులంతా కలసి నబీల్‌పై ఒత్తిడి తెచ్చారు. నబీల్ సుముఖంగా లేకున్నా బలవంతం చేసి ఫైట్‌కు దించారు.

ఈ సమయంలో సుల్తాన్ అనే యువకుడు ఒవేస్ చెవిలో ఏదో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఒవేస్... నబీల్‌పై ముష్టిఘాతాలు కురిపించాడు. నబీల్ తల ఎడమ కణతకు ఐదు బలమైన పంచ్‌లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన వారంతా వెంటనే నబీల్‌ను పక్కకు తీసుకొచ్చి నీళ్లు తాగించారు. ఫలితం లేకపోవడంతో మూర్ఛగా భావించి తాళం చెవులను అతని చేతిలో ఉంచారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న నబీల్ నోరు తెరిచి ఊపిరి పీల్చుకునేందుకు ఆయాస పడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు.
 
బైక్ ప్రమాదంగా చిత్రీకరణ...
నబీల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్నేహితులంతా కేసు తమపైకి రాకుండా ఉండేందుకు దీన్ని బైక్ ప్రమాదంగా చిత్రీకరించారు. బైక్‌పై ఫీట్లు చేస్తున్న సమయంలో నబీల్ కింద పడిపోయాడని అతని కుటుంబ సభ్యులకు తెలిపి నబీల్‌ను పురానీ హవేలీలోని దుర్రు షెహవార్ ఆసుపత్రికి తరలించారు. నబీల్‌ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తేల్చారు. కుమారుడి మరణవార్త తెలుసుకొని విదేశాల నుంచి 5న హైదరాబాద్‌కు చేరకున్న నబీల్ తండ్రిని కూడా ఇలానే నమ్మించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళితే మైనర్ బండి నడిపినందుకు కేసుతోపాటు తల్లిదండ్రులపైనా కేసు నమోదవుతుందని, పోస్ట్‌మార్టం కూడా చేస్తారంటూ దస్తగిర్‌ను భయపెట్టారు. ఇది నిజమేనని నమ్మిన దస్తగిర్ అదే రోజు బార్కాస్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
 
వెలుగులోకి తెచ్చిన వాట్సాప్
నబీల్ అంత్యక్రియలు పూర్తయ్యాక కుమారుడి మృతిపై అనుమానాలు తలెత్తిన దస్తగిర్... నబీల్‌ను ఆసుపత్రికి తరలించిన స్నేహితులందరినీ తన ఇంటికి పిలిపించి వాకబు చేయగా పొంతన లేని సమాధానాలిచ్చారు. దీంతో తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయంటూ ఈ నెల 7న దస్తగిర్ మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నబీల్ స్నేహితులదరినీ స్టేషన్‌కు పిలిపించి విచారించగా ఓ యువకుడి ఫోన్‌లోంచి వాట్సాప్ ద్వారా పంపిన వీడియో స్ట్రక్ అయి కనిపించింది.

యువకులు స్ట్రీట్ ఫైట్ చేయడం... ఈ క్రమంలోనే నబీల్ కుప్పకూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నబీల్ మృతదేహానికి బార్కాస్ శ్మశానవాటికలో సోమవారం ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అందాక నిందితులపై 302 కింద కేసు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతం నిందితులపై పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను 201 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కూడా కారణం కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు