ఆ అమ్మాయి బరిలోకి దిగితే పతకం సొంతం కావాల్సిందే..

20 Sep, 2023 13:08 IST|Sakshi

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఆ అమ్మాయి బరిలోకి దిగితే పతకం సొంతం కావల్సిందే.. పంచ్‌ కొడితే ప్రత్యర్థి బెంబేలెత్తాల్సిందే.. ప్రతిభకు పేదరికం అడ్డం రాదని నిరూపించింది షేక్‌ నస్రీనా. బాక్సింగ్‌ బరిలో ప్రత్యర్థులను తన కిక్‌తో గడగడలాడించి 15 బంగారు, 2 రజత పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది.

ప్రతిభకు తగిన ప్రోత్సాహం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు చూస్తోంది. ప్రభుత్వ తోడ్పాటు ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమాగా చెబుతోంది. ఆమె పేరు షేక్‌ నస్రీనా. ఊరు రాజమహేంద్రవరం. ఆ నగరంలోని ఐఎల్‌టీడీ ప్రాంతానికి చెందిన నస్రీనా తండ్రి షేక్‌ మస్తాన్‌ చిరు వ్యాపారం చేస్తూంటారు. తల్లి షేక్‌ మీరా టైలరింగ్‌ చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నారు.

బాక్సింగ్‌లో ఓనమాలు ఇలా..
నస్రీనా చిన్నాన్న హైదరాబాద్‌లో ఉంటారు. ఆయన ఇంటికి 2014లో వెళ్లిన ఆమె.. అక్కడ తన ఈడు పిల్లలు వివిధ క్రీడల్లో రాణించడం చూసి స్ఫూర్తి పొందింది. బాక్సింగ్‌లో విశ్వవిజేత టైసన్‌ పోరాడటాన్ని టీవీల్లో చూసి ఈ క్రీడపై ఆసక్తి పెంచుకుంది. ఆడపిల్లలకు క్రీడలు ఎందుకని ఇరుగుపొరుగు వారు నిరుత్సాహపరిచారు. కానీ కుమార్తె కోరికను తల్లిదండ్రులు అంగీకరించారు.

దీంతో నస్రీనా హైదరాబాద్‌లో చిన్నాన్న ఇంటి వద్దనే ఉండి తొమ్మిదో తరగతి చదువుతూ, ఎల్‌బీ స్టేడియంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) బాక్సింగ్‌ కోచ్‌ ఓంకార్‌ యాదవ్‌ వద్ద ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకుంది.

తరువాత తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలో ఉండటంతో హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు వచ్చేసింది. జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సింగ్‌ కోచ్‌ చిట్టూరి చంద్రశేఖర్‌ వద్ద శిక్షణకు చేరింది. నస్రీనా పట్టుదల, ఆట పట్ల ఆసక్తి, చలాకీతనాన్ని గుర్తించిన చంద్రశేఖర్‌ ఆమెకు బాక్సింగ్‌లో మెళకువలు నేర్పించారు.

కౌంటర్‌ ఎటాక్‌, మిక్సింగ్‌, ఫుట్‌వర్క్‌, స్పీడ్‌, స్టామినా, ఫిట్‌నెస్‌లో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున శిక్షణ ఇచ్చి, మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. దీంతో తొమ్మిదో తరగతి నుంచే నస్రీనా పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం మొదలు పెట్టింది.

శాప్‌ ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని మరిన్ని మెళకువలు నేర్చుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో రాజమహేంద్రవరానికే చెందిన సినీ నటుడు ఆలీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌లు నస్రీనా శిక్షణకు కొంత ఆర్థిక సహాయం అందించి, ప్రోత్సహించారు.స ప్రస్తుతం నస్రీనా రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అలాగే త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి కామన్‌వెల్త్‌, ప్రపంచ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికయ్యేందుకు ఢిల్లీలో అంతర్జాతీయ కోచ్‌, ఒలింపియన్‌ హయతుల్లా నైబీ వద్ద శిక్షణ పొందుతోంది.

సాధించిన విజయాలు
► 
మధురైలో జరిగిన ఇండియన్‌ అమెచ్యూర్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ పోటీల్లో బంగారు పతకంతో పాటు బెస్ట్‌ బాక్సర్‌ పతకం.

ఏడు రాష్ట్రాల మహిళల సౌత్‌ జోన్‌ పోటీల్లో 64, 66 కేజీల విభాగాల్లో బంగారు పతకం.

అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌ రాజధాని ఖాట్మండులో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో పసిడి పతకం.

​​​​​​​►2021లో మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ పోటీల్లో బంగారు పతకం.

​​​​​​​►2022లో జరిగిన ఏపీ స్టేట్‌ సీనియర్‌ బాక్సింగ్‌ పోటీలో రెండు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపిక.

​​​​​​​►ఇటీవల తిరుపతిలో జరిగిన ఏపీ సీఎం కప్‌ బాక్సింగ్‌ పోటీల్లో బంగారు పతకం.

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా..
బాక్సింగ్‌ నేర్చుకుంటున్న తొలి రోజుల్లో కంటిపై గాయం కావడంతో వద్దన్న అమ్మానాన్న ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అంతర్జాతీయ పోటీల ఎంపికకు తీసుకునే శిక్షణకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందిస్తే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తాను.

షేక్‌ నస్రీనా

ప్రోత్సాహం అందిస్తే పతకం ఖాయం
నేను తొలి నుంచీ కుస్తీ పోటీల్లో పాల్గొనేవాడిని. ఆడపిల్లలకు కుస్తీ పోటీలు ఎందుకులే అనుకున్న తరువాత నస్రీనాలో ఉన్న ఉత్సాహం చూసి ప్రోత్సహించాం. ఇప్పుడు ఎన్నో బంగారు పతకాలు సాధిస్తోంది. సామాన్య కుటుంబం కావడంతో నస్రీనాకు సరైన ఆహారం, ఇతర సౌకర్యాలు అందించలేకపోతున్నాం. నస్రీనాకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే దేశానికి బంగారు పతకం తీసుకురావడం ఖాయం.

– షేక్‌ మస్తాన్‌, షేక్‌ నస్రీనా తండ్రి

మరిన్ని వార్తలు