ఆంగ్లం.. అలవోకగా 

30 Jan, 2019 08:10 IST|Sakshi
శిక్షణలో ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తున్న ఏఏఓం హేమచంద్రుడు (ఫైల్‌)

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు నడుం బిగించారు. ఈమేరకు జిల్లాలోని 969 పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఉచితంగా  శిక్షణ ఇచ్చేందుకు ‘జాలీ ఫోనిక్స్‌’ ఎడ్యుకేషన్‌ సొసైటీతో ఒప్పందం కుడుర్చుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించాలని గత విద్యా సంవత్సరంలోనే నిర్ణయించారు.

ఈ క్రమంలో జిల్లాలోని 10 పాఠశాలలకు సంబంధించిన 20 మంది ఉపాద్యాయులకు రెండు విడతల్లో శిక్షణ ఇప్పించారు. ఈ మేరకుశిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు తాము బోధించే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పడంతో విద్యా సంవత్సరం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలుకు నిర్ణయించారు. దీంతో అదే సంస్థ ఆధ్వర్యాన మిగతా ఉపాధ్యాయులకు కూడా త్వరలోనే మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

24వేల మంది విద్యార్థులకు ప్రయోజనం 
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇతర భాషలపై కూడా పట్టు ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు అంతర్జాతీయ సంస్థ అయినా జాలీ ఫోనిక్స్‌ ఆధ్వర్యాన తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన అనంతరం ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రారంభిస్తే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2వ తరగతులకు చెందిన 24వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. కాగా, శిక్షణ పూర్తయ్యాక ప్రతీ పాఠశాలకు జాలీ ఫోనిక్స్‌ సంస్థ తరఫున 969 స్కూళ్లకు రూ.20వేలు విలువైన కిట్లు కూడా ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారు. ఈ కిట్‌ ద్వారా విద్యార్థులకు సులువుగా ఆంగ్ల బోధన సాధ్యం కానుంది. ఈ కిట్‌లోని వస్తువుల ద్వారా పదాలను పలకడం, ఎలాంటి ధ్వనులను వెలువరించాలనే అంశం సులువుగా తెలిసొస్తుంది. 

ప్రవేశాలు పెరిగే అవకాశం 
విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ప్రభుత్వ బడుల్లో కేవలం తెలుగు మీడియం ఉండడంతో ప్రవేశాలు ఏటా తగ్గిపోతున్నాయి. కొన్నింట్లోనైతే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఈ మేరకు పేద విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల బోధన జరిపేందుకు సిద్ధమైన అధికారులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే పది పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని పాఠశాలల్లో ప్రారంభించే ప్రవేశాలు పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
 
జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి 

ఇంగ్లిష్‌ విద్యను అందించడంలో భాగంగా అధికారులు మొదట జిల్లా కేంద్రంపై దృష్టి కేంద్రీకరించారు. జాలీ ఫొనిక్స్‌ సంస్థ చేసిన అధ్యయనం లో కూడా జిల్లా కేంద్రంలోనే తొలుత అమలు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు లేకపోవడం, ఉన్నత పాఠశాల స్థాయికి వెళ్లాక అదే పరిస్థితి కొనసాగుతున్న కారణంగా పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. అయితే హైస్కూల్‌ విద్యార్థులకు ఒకవేళ శిక్షణ ఇచ్చినా తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో నేర్చుకునే అవకాశం లేదని భావించి.. ప్రాథమిక స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 

విద్యార్థులకు ఎంతో మేలు... 
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం లేని కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిది. ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన బోధన అందనుంది. – శ్యాంబాబు,

ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, మణికొండ ఇంగ్లిష్‌తో మంచి ఫలితాలు 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. గతంలో శిక్షణ తీసుకుని మా పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్నాం. విద్యార్థుల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం లేదనే కారణంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపే వారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.సునీత, ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, మరికల్‌
 
ఆనందంగా ఉంది.. 

ప్రస్తుతం చాలా ప్రైవేట్‌ పాఠశాలలు కూడా జాలీ ఫోనిక్స్‌ సంస్థ వారు ఇచ్చే శిక్షణ ఆధారంగానే బోధిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు అందిస్తున్న నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం విద్య మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందనుండడం ఆనందంగా ఉంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు అవకాశం ఉంది.  – ఎం.శ్వేత, ప్రాథమిక పాఠశాల, పిల్లలమర్రి 

మరిన్ని వార్తలు