పవన్‌.. ఇవన్నీ ఎందుకు? హ్యాపీగా టీడీపీకి ప్రచారం చేస్కోవచ్చుగా!

27 Oct, 2023 12:04 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక చెప్పాల్సింది ఒకటే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో  ఆంగ్ల మీడియం చదివే పిల్లలపై కూడా కేసులు పెడతామని. ఏమో! ఆ మాట కూడా చెప్పేస్తారేమో! మంచి విద్యాబుద్దులు ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడేవారు కారేమో! ఆయనకు ఉన్నది మిడిమిడి జ్ఞానం, అత్తెసరు చదువు. అదృష్టం కలిసి వచ్చి యాక్టర్ అయ్యారు. దానినే రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. అది ఆయన ఇష్టం. కాని తనకు తోచిందల్లా చెప్పి పేదలపైన, ఆంధ్రప్రదేశ్‌ పైనా విషం చిమ్ముతానంటే ప్రజలు సహిస్తారా?. 

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంగ్ల మీడియంకు సంబంధించిన చదువులు పెట్టినందుకు పవన్‌ అధికారంలోకి రాగానే కేసులు పెడతారట. ఐబీ సిలబస్ ఎందుకు? టోఫెల్ పరిజ్ఞానం ఎందుకు? యూట్యూబ్ చూస్తే అమెరికా యాక్సెంట్ వచ్చేస్తుందని పవన్ చెబుతున్నారు. మరి అదేదో తాను నేర్చుకుని అమెరికాలో అప్పచెప్పి ఉండాల్సింది కదా!. అమెరికా లో ఒక  యూనివర్శిటీకి వెళ్లి , అక్కడి అమెరికన్ విద్యావేత్త ఒకరు అడిగిన ప్రశ్నకు తడుముకుంటూ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వంక చూడడం ఎందుకు?. జగన్ పేదల చదువులకు వేలకోట్లు ఖర్చు పెట్టడం కూడా తప్పేనట!. అసలు ఏపీలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఏనాడైనా పవన్ కల్యాణ్ పరిశీలించారా?. కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏమి చెబితే అదే ఉపన్యసిస్తూ, తన అమాయక అభిమానుల్ని రెచ్చగొట్టి, తానేదో సాధించేశానని అనుకుంటున్నారు.

✍️నిజానికి పవన్ కల్యాణ్ వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాని ఆయన తెలిసి, తెలియక అజ్ఞానంతో మాట్లాడి ఆంధ్రుల పరువు తీస్తున్నారనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఏదో తెలుగుదేశం కోసం పనిచేసుకోకుండా, మధ్యలో ఆయనకు ఇంగ్లీష్ మీడియం గొడవ ఎందుకు?. నిజంగానే ఆయనకు ఆ మీడియంపై అంత వ్యతిరేకత ఉంటే.. తన పిల్లలను మంచి,మంచి అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఓక్రిడ్జ్ వంటి స్కూళ్లలో ఎందుకు చదివించారు. ఆ సందర్భంగా ఆయన అబ్బో ఇది గొప్ప స్కూలు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని అన్నారే!. అదే ప్రకారం ఏపీలో కూడా సిలబస్ నుంచి అన్నింటిలో మార్పులు తెచ్చి పిల్లలకు మేలైన విద్య అందించాలని జగన్ తలపెడితే మాత్రం ఎక్కడలేని అక్కసా? అసలు ఐబీ అంటే ఏమిటో, ఏఐ అంటే ఏమిటో? టోఫెల్ అవసరం ఎందుకో? పిల్లలకు వాటిలో ట్రైనింగ్ ఇస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉంటే ఇలా పిచ్చితనంతో మాట్లాడేవారా?. ఇలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండి ,ప్రజలకు సందేశాలు ఇవ్వడం కన్నా ఏపీకి అవమానం ఏమి ఉంటుంది చెప్పండి!.

ఒకవేళ పవన్‌కు విషయాలపై అవగాహన ఉంటే ఫలానా విధంగా అమలు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వొచ్చు. అలాకాకుండా ఈ సిలబస్, విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్న జగన్‌ను, అందుకు బాధ్యులైన అధికారులు, ఇతరులపై కేసులు పెడతామని అంటే ఏమని అనుకోవాలి. పైగా అతి తెలివిగా యూట్యూబ్‌లో అన్నీ తెలుసుకోవచ్చట. ఆయన తన పిల్లలకు అలాగే చేస్తారా?. యూట్యూబ్ చూసి చదువుకోండి అని చెబుతారా?. ఇక్కడే ఆయన పెత్తందారి బుద్ది తెలిసిపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

✍️పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. తెలుగు అంటూ పెద్ద ఉపన్యాసాలు చేసే నాయకుల పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదవలేదు. వారి మనుమళ్లు కూడా అంతే. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనే చదువుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు దేవాన్ష్ ఏ స్కూలులో చదువుతున్నది, ఏ మీడియంలో అభ్యసిస్తున్నది ఎన్నడైనా చెబుతున్నారా! పోనీ పవన్ కల్యాణ్‌ అయినా అడిగి తెలుసుకున్నారా!. అలాగే రామోజీరావు కుమారులు, మనుమళ్లు,మనుమరాళ్లు అంతా ఆంగ్ల మీడియం దారిలోనే చదువుకున్నారు. ఆయన పెట్టిన స్కూల్ కూడా ఆంగ్ల మీడియంలోనే బోధిస్తోంది. కాని ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో పేదలకు ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసి విషం చిమ్ముతుంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వరస అంతే. మిగిలిన తెలుగుదేశం మీడియా వారిది అదే బాట. కాని నీతులు చెబుతుంటారు.

✍️తెలుగును ఎవరూ వద్దనడం లేదు. కాని తెలుగుతోపాటు ఆంగ్ల మీడియంలో చదివితే అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు కూడా పోటీపడతారన్నది జగన్ ప్రభుత్వ ఆకాంక్ష. ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల పిల్లల బృందం ఒకటి అమెరికాలో పర్యటించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా మాట్లాడి వచ్చింది. అక్కడ వారు మాట్లాడింది ఇంగ్లీష్లోనే. అక్కడకు వెళ్లి తెలుగులో మాట్లాడితే తెల్లమొహం వేసుకుని చూడాల్సిందే. ఆంగ్లం రావడం వల్ల వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం వస్తుంది. పోటీ సమాజాన్ని సమర్ధంగా ఎదుర్కోగలుగుతారు. అలాంటివాటిని పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ వంటివారు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కొత్తగా వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ లు ఇస్తే ప్రజలే గుణపాఠం చెప్పాలి.

ఏపీలో ఏదైనా మంచి చేయాలంటే ఎంత కష్టమో చంద్రబాబు,  పవన్ కల్యాణ్ వంటివారిని చూస్తే అర్థమవుతంది. ప్రతిదానికి అడ్డుపడడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా అదే గేమ్ సాగించారు. కానీ ఆకస్మికంగా పరిస్థితి మారింది. చంద్రబాబు నాయుడు  అవినీతి కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లవలసి వచ్చింది. అంతే!.  పవన్ కల్యాణ్ స్వరంలో అవినీతి గురించి మార్పు వచ్చింది. అబ్బే! అవినీతి అనేది కామన్.. దానిని కొంతవరకు ఆమోదించవచ్చని ఆయన చెప్పే దశకు చేరుకున్నారు. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు పై రూ. 240 కోట్ల అవినీతి అభియోగాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని చెబుతున్నట్లుగా ఉంది.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లోనే కాదు. ఫైబర్ నెట్, అస్సైన్డ్ భూముల కేసులు ,ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మొదలైనవన్నివాటిలో వందల కోట్లు తినడం పెద్ద తప్పు కాదని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. అవినీతిపై వచ్చిన కేసుల గురించి మాట్లాడని పవన్ కల్యాణ్, చంద్రబాబుపై వచ్చిన  వందల కోట్ల అవినీతి గురించి నోరెత్తని పవన్ కల్యాణ్ ఆంగ్ల మీడియం తెచ్చి స్కూళ్లను బాగు చేసినందుకు జగన్ పైన, ఇతర సంబంధిత వ్యక్తులపైన కేసులు పెడతానని అంటున్నారు. ఇలాంటి వాళ్లు ఏపీకి అవసరమా?... 


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు