పెండింగ్ ప్రాజెక్టుల కోసం పట్టు

23 Feb, 2015 02:01 IST|Sakshi
పెండింగ్ ప్రాజెక్టుల కోసం పట్టు

* రైల్వే బడ్జెట్‌కోసం పాత విజ్ఞప్తులతోనే ప్రతిపాదనలు పంపిన తెలంగాణ ప్రభుత్వం
కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు మళ్లీ వినతి
* వ్యాగన్‌వీల్ ఫ్యాక్టరీకి నిధులు..
* కాజీపేటకు డివిజన్ హోదాకు మరోసారి ప్రయత్నం

 
 సాక్షి, హైదరాబాద్: రైల్వేలో సంస్కరణల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈసారి రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉండదని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం పాత ప్రతిపాదనలపైనే పట్టుబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ైరె ల్వేశాఖకు అధికారికంగా ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వాటిని పాతవాటితో నింపేసింది. జనవరిలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన మర్యాదపూర్వక సమావేశంలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల అంశం చర్చకొచ్చింది. కొత్త రాష్ట్రం గా అవతరించడంతోపాటు దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి సరైన ప్రాధాన్యం దక్కలేదనే విషయాన్ని సురేశ్‌ప్రభుకు కేసీఆర్ తెలియజేస్తూ రైల్వే బడ్జెట్‌లో తమ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలని గట్టిగా కోరారు.
 
 ముఖ్యంగా కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి యూపీఏ-2 ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ప్రస్తావించినందువల్ల ఈసారైనా కోచ్‌ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదన సరికాదని నిపుణుల కమిటీ తేల్చినట్లు పేర్కొన్న సురేశ్‌ప్రభు...కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ విషయంలో ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన  సీఎం కె.చంద్రశేఖర్ రావు తాజా ప్రతిపాదనల్లో మొదటగా దాన్నే ప్రస్తావించారు. దీంతోపాటు ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి ఈసారి నిధులు కేటాయించాలని, కాజీపేటకు డివిజన్ హోదా ప్రకటించాలని పేర్కొన్నారు.
 
 ఆర్‌యూబీ/ఆర్‌ఓబీ ప్రతిపాదనలు
 లెవల్ క్రాసింగ్స్‌ను తొలగించే క్రమంలో కొత్త గా 15 చోట్ల ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి ఎక్కడంటే... కరీంనగర్ జిల్లాలోని ఉప్పల్-జమ్మికుంట స్టేషన్ల మధ్య, జమ్మికుంట-బిసుగిర్ షరీఫ్ మధ్య, కొలనూర్-పెద్దపల్లి, మహబూబ్‌నగర్-ఎంక్యూఎన్, మెదక్ జిల్లా జహీరాబాద్- మెట్లకుంట, నల్లగొండ జిల్లా ఆలేరు-పెంబర్తి మధ్య, వరంగల్ జిల్లా కాజీపేట-హసన్‌పర్తి, కాజీపేట-వరంగల్, వరంగల్-చింతలపల్లి, చింతలపల్లి-ఎల్గూర్, మహబూబాబాద్ యార్డు, గార్ల-డోర్నకల్, నష్కల్-పెండ్యాల మధ్య, నిజామాబాద్‌లో యూపీడబ్ల్యూ-కేఎంసీ, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం- గంగినేని మధ్య వీటిని నిర్మించాలని కోరింది.
 
 మరికొన్ని ప్రతిపాదనలు
 - పెద్దపల్లి- నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ లైన్ (178.39 కి.మీ.): తుది దశగా ఉన్న పెద్దపల్లి-జగిత్యాల (81 కి.మీ.) పెండింగ్ పనులను పూర్తిచేయాలి.
 - మనోహరాబాద్-కొత్తపల్లి (153.6 కి.మీ.): ఐదేళ్ల యాన్యుటీ పద్ధతిలో రూ. 367.05 చెల్లించేందుకు ఆమోదం తెలిపినందున ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. (దీని అంచనా వ్యయం రూ. 952 కోట్లు. రైల్వే భరించాల్సిన వాటా రూ. 579.73 కోట్లు)
-  అక్కన్నపేట-మెదక్ (17.16 కి.మీ.): రూ.117.74 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో 50 శాతం ఖర్చు భరించటమే కాకుండా స్థలాన్ని ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించినందున బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.(ఇప్పటికే రూ.35.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది)
-  భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి (56.25 కి.మీ.): 2010-11లో ఖరారైన ఈ ప్రతిపాదనకు నిధులు కేటాయించాలి.
-  మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్: లైన్ పనులు కొనసాగుతున్నా గోదావరిపై వంతెన పనులకు నిధులు కేటాయించాలి.
 -  కాజీపేట-విజయవాడ, రాఘవాపురం-మందమర్రి మూడో లైన్  పని వేగం పెంచాలి.
-   మణుగూరు-రామగుండం (200 కి.మీ.) కొత్త లైన్ సర్వే పనులు పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలి.
 -  హైదరాబాద్-మహబూబ్‌నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్, పగిడిపల్లి-శంకర్‌పల్లి డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించాలి.
 -  గద్వాల-మాచర్ల, పాండురంగాపురం-భద్రాచలం లైన్లకు మోక్షం కల్పించాలి. ళీ వరంగల్‌లో రైల్వే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

>
మరిన్ని వార్తలు