ఇలాగే ఉంటే  డిపాజిట్లు కూడా చేయరు

20 Apr, 2018 01:21 IST|Sakshi

బ్యాంకులు ప్రజల కోసం అనే ఫీలింగ్‌ కలగడం లేదు

బ్యాంకుల్లో ఇబ్బందులపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు 

18వ ఎస్‌ఎల్‌బీసీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 

రైతులను ఇబ్బందులు పెట్టి శత్రువులు కావొద్దు: మంత్రి పోచా

సాక్షి, హైదరాబాద్‌: ‘‘బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేవు. సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. కూలీలకు రెండు వేల రూపాయల నోట్లు ఇస్తే ఎలా పంచుకుంటారు. బ్యాంకుల తీరు ఇలాగే ఉంటే ప్రజలు ఎవరూ డిపాజిట్లు కూడా చేయరు. దీర్ఘకాలంలో అది మీకే ఇబ్బంది. ఇలాంటి వాటిని ప్రజలు భరించే పరిస్థితు ల్లో లేరు. రాష్ట్రంలో డబ్బు కొరత లేకుండా చూడండి’’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బ్యాంకు అధికారులకు సూచించారు. నగదు కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరామని చెప్పారు. బ్యాంకుల్లో ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం 18వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్‌ఎల్‌బీ సీ) జరిగింది. ఆర్థిక మంత్రి ఈటలతో పాటు వ్యవసాయ మంత్రి పోచారం్డ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నాబార్డ్‌ జీఎం సత్యప్రసాద్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మణికందన్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. 

ప్రజల కోసం అనే ఫీలింగ్‌ లేదు.. 
ట్రాక్టర్లపై 50 శాతం సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా డీడీ ఇవ్వడానికి డిపాజిట్‌ చేయించుకోవడం దారుణమని, బ్యాంకులు ప్రజల కోసం ఉన్నాయనే ఫీలింగ్‌ రావడం లేదని పేర్కొన్నారు. వ్యాపారం చేసే సత్తా ఉండి డబ్బులు లేనివారికి సాయం అందించాలని, లోన్‌ ఇచ్చి వదిలేయకుండా.. నెలనెలా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు బ్యాంకుల మద్దతుకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలపుతున్నామని ఈటల చెప్పారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు కాలిపోలేదని, రైతుకి డబ్బులు ఆదా అయ్యాయని, గతంలో కరెంటు ఇవ్వకపోవడం వల్ల పరిశ్రమలు మూతపడి బ్యాంకులు నష్టపోయాయని అన్నారు. తమ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ ఇవ్వడం వల్ల పరిశ్రమలకు డబ్బులు వచ్చాయని, బ్యాంకులకు ఈఎంఐలు అందాయని, అందుకే ప్రజలకు మద్దతివ్వాలని కోరారు. ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయాలు కింది స్థాయి వరకు అమలు కావాలన్నారు.  

ఇబ్బందులు పెట్టి శత్రువులు కావొద్దు: పోచారం 
రైతులకు సరిపోయేంతగా నగదు సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం సూచించారు. పెట్టుబడి సాయంవిషయంలో రైతులను ఇబ్బంది పెట్టి వారికి శత్రువులు కావొద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల మంది రైతుల్లో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులేనని, వారికి ఎలాంటి సమస్యలూ రాకుండా, ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత 
సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రాధాన్యతా రంగాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఇన్ని సమీక్షలు చేసినా పేదరికంలో ఉన్న వారికి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదని, వారికి బ్యాంకులు విశ్వాసం కల్పించాలన్నారు. పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోందని, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా.. తామే ప్రజలకు డబ్బులు ఇస్తున్నామన్న ఆలోచన నుంచి బ్యాంకులు బయటికి రావాలని సూచించారు. చిన్న రుణానికి సెక్యూరిటీ పెట్టాలని బ్యాంకులు ఇబ్బంది పెట్టడం సరికాదని, పాత పద్ధతులకు స్వస్తి పలకాలని చెప్పారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఇవ్వాలని తాము అడగడం లేదని, మహిళా సంఘాలకు, పేదలకు ఇవ్వమని కోరుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు