బడ్జెట్ కేటాయింపులపై 'నాయీ' హర్షం

16 Mar, 2018 20:02 IST|Sakshi
లింగం నాయీ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో తమ సామాజిక వర్గానికి తగినన్ని కేటాయింపులు జరపడం పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్నివర్గాలకు సముచితంగా నిధులు కేటాయించారని ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందనడానికి ఈ బడ్జెట్ నిదర్శమని ప్రశంసించారు.

నాయీబ్రాహ్మణుల సాధికారతకు తగినన్ని నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. తమకు కేటాయించిన నిధులను తగినవిధంగా ఖర్చుచేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారైనా నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని, తమ జనాభాను దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయిస్తే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలి
చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు.

మరిన్ని వార్తలు