పోలీసులకు వీక్లీ ఆఫ్‌ 

24 Jun, 2019 02:36 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అమలుకు పోలీసు శాఖ నిర్ణయం 

నేటి నుంచే అమలుకు జిల్లా ఎస్పీల మొగ్గు 

ఆదేశాలు జారీ చేసిన డీజీ కార్యాలయం

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారాంతపు సెలవు అమలుకు రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు డీజీ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. డ్యూటీ రోస్టర్‌ చార్ట్‌ ప్రకారం.. సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ ఆఫ్‌లు ప్లాన్‌ చేయాలని డీజీ కార్యాలయం అన్ని జిల్లా ఎస్పీ, కమిషనర్‌ కార్యాలయాలను ఆదేశించింది. చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు నేటి నుంచే అమలు చేయడానికి మొగ్గు చూపించడం గమనార్హం. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచే ఈ డిమాండ్‌ను అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కరీంనగర్‌లాంటి కొన్ని జిల్లాల్లో అమలు చేశారు. తరువాత అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కూడా వీక్లీ ఆఫ్‌ ప్రస్తావన వచ్చినా.. అమలు చేసేలోగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా వీక్లీ ఆఫ్‌పై సానుకూలంగా స్పందించారు.  

కోడ్‌ కారణంగా కొండెక్కిన అమలు.. 
రాష్ట్రంలో సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నికల కోడ్‌ కారణంగా వారాంతపు సెలవు అమలు కుదరలేదు. తరువాత సర్పంచి, స్థానిక సంస్థలు, పార్లమెంట్‌ ఎన్నికలతో వరుసగా రాష్ట్రంలో గత మే నెల వరకు ఎన్నికల కోడ్‌ ఉంది. దీంతో అమలు సాధ్యం కాలేదు. తాజాగా ఈ నెల నుంచి ఏపీ ప్రభుత్వం కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేయడంతో తిరిగి తెలంగాణలోనూ ఈ విషయంపై కదలిక వచ్చింది. దీంతో నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు వీక్లీ ఆఫ్‌ అమలు చేయడం ప్రారంభించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ డిమాండ్‌ పెరగడం, పోలీసు అధికారుల సంఘం కూడా డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వారంతాపు సెలవుపై విన్నవించడంతో మార్గం సుగమమైంది. 

వేధిస్తున్న సిబ్బంది కొరత.. 
వాస్తవానికి రాష్ట్ర జనాభాకు ఉన్న పోలీసులు ఇప్పుడు ఏమాత్రం సరిపోరు. ఉద్యోగుల కొరత కారణంగానే ఇంతకాలం వీక్లీ ఆఫ్‌ అమలు సాధ్యపడలేదు. పోలీసు మాన్యువల్‌ 617 ప్రకారం వీక్లీ ఆఫ్‌ తీసుకోవచ్చు. కానీ, డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సిబ్బంది కొరత కారణంగా ఇది ఇంతకాలం సాధ్యపడలేదు. మొత్తానికి పోలీసుల చిరకాల డిమాండ్‌ నెరవేరబోతున్నందుకు డిపార్ట్‌మెంట్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 400 మందికి ఒక పోలీసు చొప్పున ఉండాలి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ప్రతీ 800 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. పోలీసుశాఖలో ఇప్పుడు 54 వేల మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో రిక్రూట్‌కాబోతున్న 18,500 మంది పోలీసులు విధుల్లో చేరితే, వీక్లీ ఆఫ్‌ అమలు మరింత సులువు కానుంది. 

డీజీపీ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు
నిత్యం 24 గంటల డ్యూటీతో సతమతమయ్యే పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో డీజీపీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పనిఒత్తిడి, విరామం లేని విధుల కారణంగా చాలామంది సిబ్బంది మధుమేహం, బీపీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో స్వాంతన చేకూరుస్తుంది. 
-గోపీరెడ్డి, పోలీసు అధికారుల సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు