సౌరవిద్యుత్‌ ఉత్పాదనలో భేష్‌

21 Dec, 2019 04:58 IST|Sakshi
పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, మంత్రి జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ఉత్పత్తి, ఆదాలో తెలంగాణే ఆదర్శం: గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ ఉత్పాదనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం అభినందనీయమని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా మరిన్ని పరిశ్రమలను ఆకర్షిస్తోందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) ఏర్పాటు చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాల కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యుత్‌ ఉత్పత్తిలోనే కాకుండా ఆదా చేయడంలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావడం హర్షణీయమన్నారు. విద్యుత్‌ పొదుపుతో పాటు నీటి పొదుపును కూడా ప్రజలు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా కార్యాలయ సముదాయాల్లో ఎయిర్‌ కండిషనర్‌ వినియోగాన్ని తగ్గించేందుకు విరివిగా మొక్కలను పెంచాలని సూచించారు. ఇంధన ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వామ్యులవ్వాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చెట్లను తొలగించినా అంతే స్థాయిలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రజలకు అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణే అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్‌ ఆదాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. రైతులకు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ను 24/7 రైతులకు అందిస్తున్నట్టు టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్‌ ఆదా, ఉత్పాదనకు సమానమన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఇంధన విని యోగాన్ని తగ్గించిన వారికి పురస్కారాలను గవర్నర్‌ అందజేశారు. మొత్తం 130 దరఖాస్తులు రాగా 8 కేటగిరీల్లో వారిని గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేశారు.

మరిన్ని వార్తలు