ప్రాణం తీసిన సరదా

4 May, 2014 02:25 IST|Sakshi

 కాంసానిపల్లి (ఉప్పునుంతల), న్యూస్‌లైన్ : అతను పదో తరగతి విద్యార్థి.. ఇటీవ లే వార్షిక పరీక్షలు రాశాడు.. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో శుభకార్యంలో పాల్గొనడానికి తాతయ్య ఇంటికి వచ్చాడు.. బంధుమిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపాడు.. అది ఎంతోసేపు నిలువలేదు.. వరసకు తమ్ముళ్లతో కలిసి సరదాగా సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
 
 అచ్చంపేట మండలం పల్కపల్లికి చెందిన పద్మమ్మ, వెంకటేష్ దంపతులకు కుమారుడు శివకుమార్ (15), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా వీరందరూ హైదరాబాద్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ బాలుడు నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఇటీవలే వార్షిక పరీక్షలు రాశాడు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో తల్లి సూచన మేరకు శుక్రవారం ఉదయం ఉప్పునుంతల మండలం కాంసానిపల్లిలోని తాతయ్య మాడిశెట్టి నారయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు బంధువుల ఇంట్లో నిర్వహించిన శుభకార్యంలో పాల్గొన్నాడు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం వరసకు తమ్ముళ్లు (చిన్నమ్మల కొడుకులు) సతీష్, రాఘవేందర్‌తో కలిసి సమీపంలోని కోరండం బావికి సరదాగా ఈత కోసం వెళ్లాడు. కొద్దిసేపటికే నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఇది గమనించిన ఇద్దరు పిల్లలు వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి విషయాన్ని తాతయ్యతో పాటు గ్రామస్తులకు తెలిపారు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని అరగంట పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగి పోయారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు వచ్చి బాలుడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
 

మరిన్ని వార్తలు