మాటలు చెప్పి కాలం గడపడమే పని...

2 Apr, 2017 03:00 IST|Sakshi

కేసీఆర్‌పై తమ్మినేని ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: ఎప్పటికప్పుడు కొత్త మాటలు చెప్పి సమయాన్ని వెళ్లబుచ్చడం సీఎం కేసీఆర్‌ ఎత్తుగడగా కనిపిస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. అట్టడుగువర్గాలు, మైనారిటీలు, బీసీలు,ఎంబీసీ ల సంక్షేమం కోసం అసెంబ్లీలో, బయటా చేసిన ప్రకటనలపై ఈ ఏడాదే చట్టం తీసుకువచ్చి కేసీఆర్‌ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ పాదయాత్ర ప్రభావంతో ఆయా వర్గాలకుసామాజికన్యాయం అందిస్తామంటూ సీఎం ప్రకటనలు చేశారన్నారు.  చట్టబద్ధంగా బీసీలు, మైనారిటీలకు ఆయా హక్కులు కల్పించాలని, అప్పుడే సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు.

అయితే ఆ దిశలో ప్రభుత్వంచర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. శనివారం ఎంబీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజికన్యాయం కోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర లక్ష్యాలు, కర్తవ్యాలనుకొనసాగించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయమే కీలకం కాబట్టి అట్టడుగు వర్గాల అభివృద్ధి తప్ప మరో మార్గం లేదన్నారు. తమ ఉద్యమానికి మద్దతునిచ్చిన పెద్దలు, సామాజిక సంఘాలు,ఇతర వామపక్షాలు, కలిసొచ్చే శక్తులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

పెద్దపల్లిలో అగ్రకుల యువతిని ప్రేమించాడనే కారణంతో ఒక దళిత యువకుడు హత్యకుగురయ్యాడన్నారు. ఈ ఘటనను నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఆ యువకుడి శవానికి మళ్లీ పోస్ట్‌మార్టమ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై నిజనిర్ధారణ కమిటీ పరిశీలించి వచ్చాకభవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు