అందుకే  మమ్మల్ని కాంగ్రెస్‌ వదిలేసింది

14 Nov, 2023 04:18 IST|Sakshi

కమ్యూనిస్టుల ఐక్యతకు కట్టుబడి ఉన్నాం... సీపీఐ వైఖరిపై నో కామెంట్‌ 

బీఆర్‌ఎస్‌ వంటి ప్రాంతీయ పార్టీలవన్నీ అవకాశవాద రాజకీయాలే 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

బొల్లోజు రవి
కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ మిర్యాలగూడ స్థానం సహా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే మద్దతు ఉంటుందని, లేకుంటే ఉండదని సీపీఎం తేల్చిచెప్పింది. దీంతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం సొంతంగా బరిలోకి దిగింది.  కాంగ్రెస్‌తో పొత్తు విచ్ఛిన్నం, కాంగ్రెస్‌తో సీపీఐ వెళ్లిపోవడం, ఒంటరిపోరు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. 


 కాంగ్రెస్‌తో పొత్తు విఫలమయినట్లేనా? 
ఇంకా ఏమైనా ఆశలున్నాయా?
 
     కాంగ్రెస్‌తో పొత్తు కథ ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ  ఇక పొత్తు ఉండదు. ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. మేం ప్రకటించిన 19 స్థానాల్లో అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడుగుతారు. మిర్యాలగూడను ఒకవేళ వాళ్లు మాకిచి్చనా కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యరి్థని ఏదో రకంగా రంగంలోకి దింపేది. అయినా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు లేకుండా పొత్తు ఎలా ఉంటుంది. 

కాంగ్రెస్, వామపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు నష్టమే కదా... అలాంటిది మీతో పొత్తు విషయంలో ఎందుకు ఇలా చేస్తుందని భావిస్తున్నారు?  
     మాతో ప్రయోజనం లేదని కాంగ్రెస్‌ మమ్మల్ని వదిలేసింది. పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు నష్టమట. మాకు సీట్లు ఇస్తే ఓడిపోతామని, అదే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుస్తారని వారి నమ్మకం. మేము పోటీ చేయడం వల్లే వారికి లాభమట. మాతో చర్చల సందర్భంగా కూడా కాంగ్రెస్‌ నాయకులు ఈ విధంగానే మాట్లాడారు. అందుకే పొత్తు విషయంలో ముందుకు రావడంలేదు.  

సీపీఐకి కొత్తగూడెం స్థానంలో మద్దతు ఇస్తారా? అలాగే మీరు పోటీ చేసే 19 స్థానాల్లో మద్దతు కోరతారా? 
కొత్తగూడెంలో సీపీఐ తరపున పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుకు మద్దతు ఇస్తున్నాము. అయితే మేం పోటీ చేసే 19 చోట్ల సీపీఐ మద్దతు ఇస్తుందని నేననుకోను. ఎందుకంటే సీపీఐ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో భాగంగానే కొత్తగూడెం స్థానం కేటాయించారు. కాబట్టి సీపీఐ మాకు మద్దతు ఇవ్వదు. ఒకవేళ వారి ఓటర్లు ఎక్కడైనా మాకు మద్దతు ఇస్తే అది వారిష్టం. 

బీఆర్‌ఎస్‌ది అవకాశవాదమని మీరు భావిస్తున్నారా..? 
బీఆర్‌ఎస్‌గానీ, ఇతర ప్రాంతీయ పార్టీలుగానీ అవకాశవాదంతోనే వ్యవహరిస్తాయి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదించడమే తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్న వాతావరణాన్ని సృష్టించాలని భావించింది. ఆ సమయంలో కేసీఆర్‌కు మరో మార్గం లేదు. అందుకే బీజేపీని వ్యతిరేకించారు. ఆ తర్వాత కర్నాటక ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకుంది. కేసీఆర్‌ మూడ్‌ మారిపోయింది. బీజేపీతో ప్రమాదం లేదని అర్ధమైంది. ఈ ఎన్నికల తర్వాత సీట్లు తక్కువైతే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉంది. అందుకే కమ్యూనిస్టుల అవసరం కేసీఆర్‌కు లేదు. అవకాశవాదంతో రాజకీయాలను మార్చారు.  

ఈ ఎన్నికల్లో ఒక్క సీటయినా సాధిస్తారా..? 
గెలుస్తామన్న నమ్మకంతోనే 19 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. అన్ని చోట్లా గెలవాలన్నదే మా లక్ష్యం.

మరిన్ని వార్తలు