జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

30 Nov, 2014 04:35 IST|Sakshi
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

నర్సాపూర్: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ కేవలం 8 మండలాలను మాత్రమే ప్రభుత్వం  కరువు మండలాలుగా ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాగే అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి రైతు కూలీలను ఆదుకోవాలన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని ఉండడంతో రైతులు  కూలీలుగా  మారారని  ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రభుత్వ గోదాముల్లో స్థలం లేదంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతుల వద్ద ధాన్యం ఉన్నంత వరకు కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 72 గంటల్లో ధాన్యం విక్రయించిన సొమ్ము వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలన్నారు.  అలాగే చెరకు మద్దతు ధరను టన్నుకు రూ.మూడు వేలుగా ప్రకటించాలన్నారు. చెరకు క్రషింగ్ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో  రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు.

విచారణ పేరుతో కాలయాపన..
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ప్రభుత్వం విచారణల పేరుతో కాలయాపన చేయవద్దని  సునీతారెడ్డి ప్రభత్వాన్ని కోరారు. ఆత్మహత్యలపై డీఎస్పీ, ఆర్డీఓ, తహశీల్దార్లు విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని, విచారణలో జాప్యం జరగడంతో రైతు కుటుంబాలకు నష్టం జరగుతోందన్నారు.

పార్టీ సభ్యత్వంపై రేపు సమీక్ష
జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని సునీతారెడ్డి పేర్కొన్నారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆదివారం జహీరాబాద్‌కు, డిసెంబరు 3న నారాయణఖేడ్‌కు పార్టీ ప్రముఖులు రానున్నట్లు తెలిపారు.  డిసెంబరు 1న జిల్లాలో సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు అందోలులో  జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో  పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరవుతారన్నారు. సమీక్షకు జిల్లాలోని పార్టీ మండల స్థాయి నాయకులు తదితరులు హాజరు కావాలని కోరారు.   జిల్లాలో లక్షా 20వేల సభ్యత్వ నమోదు లక్ష ్యంగా నిర్ణయించామన్నారు.

మరిన్ని వార్తలు