పెరిగిన పోలింగ్‌.. ఎవరికి కలిసొచ్చేనో..

9 Dec, 2018 14:26 IST|Sakshi

2014 ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువ  

గ్రామీణ సెగ్మెంట్లలో గణనీయంగా పెరుగుదల 

వలస ఓటర్లకు గాలం వేసిన పార్టీలు 

శివారు నియోజకవర్గాల్లో స్వల్పమే.. 

ఓటింగ్‌ సరళిని మదింపు చేస్తున్న అభ్యర్థులు 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్‌ పోటెత్తింది. గతంతో పోలిస్తే ఈసారి భారీగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన రాజకీయపక్షాలు.. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వచ్చేలా ప్రోత్సహించాయి. ఓటు విలువను తెలుపుతూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించిన ప్రచారం కూడా పోలింగ్‌ పెరగడానికి దోహదపడింది. 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 65.71 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి 67.34 శాతం నమోదైంది. 

గ్రామీణుల హుషారు! 
పట్టణ నియోజకవర్గాలతో పోలిస్తే ఈసారి గ్రామీణ సెగ్మెంట్లలో పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. షాద్‌నగర్, కల్వకుర్తి స్థానాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి షాద్‌నగర్‌లో 7.63 శాతం, కల్వకుర్తిలో 6.01 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నియోజకవర్గాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొనడం.. ప్రతి ఓటు విలువైనదే కావడంతో ధన ప్రవాహం కూడా భారీగానే జరిగింది. దీంతో వలస ఓటర్లకు గాలం వేసిన పార్టీలు ఓటర్లను తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాయి. కొందరు అభ్యర్థులు ఏకంగా రోజువారీ కూలీని పంపిణీ చేశారు. మందు, విందు షరా మామూలే. ఈ నేపథ్యంలోనే ఓట్లేసేందుకు గ్రామీణులు పల్లెబాట పట్టారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరారు. ఇలా ఓటెత్తిన చైతన్యం ఎవరిని గెలిపిస్తుందోనని చర్చించుకుంటున్నారు. పోలింగ్‌ శాతం పెరగడం అభ్యర్థుల్లో దడ పుట్టిస్తోంది.  

శివార్లలో స్వల్పమే అయినా.. 
శివారు నియోజకవర్గాల్లోనూ ఓటింగ్‌శాతం పెరిగింది. వాస్తవానికి ఈ సెగ్మెంట్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో పోలింగ్‌ జరగకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే అధికంగా నమోదు కావడం సానుకూల పరిణామం. శేరిలింగంపల్లి స్థానంలో  2014లో 47.9 శాతం నమోదు కాగా.. ఈ సారి 48.51 శాతం నమోదైంది. అంటే 0.61శాతం పోలింగ్‌ పెరిగిందన్నమాట. అలాగే ఎల్‌బీనగర్‌లో 2.07 శాతం, మహేశ్వరంలో 1.03 శాతం పోలింగ్‌ ఈ సారి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఈ నియోజకవర్గాల పరిధిలో స్థిరపడ్డారు. వీరందరికి అటు గ్రామాల్లో.. ఇటు నగరంలోనూ ఓట్లు ఉన్నాయి. దీంతో తమ స్వస్థలాల్లో ఓటేసేందుకే వీరు ప్రాధాన్యం ఇస్తుండడంతో శివారు సెగ్మెంట్లలో ఓటింగ్‌ శాతం తరుగుదలకు కారణమవుతోంది. ఎప్పటికప్పుడు పలుచోట్ల నమోదైన ఓట్లను ఏరివేస్తున్నామని ప్రకటిస్తున్నా అది ఆచరణలో కనిపించడం లేదు. దీనికితోడు శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల్లో ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు నివసిస్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఓటేయడానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణ సెగ్మెంట్ల కంటే చాలా తక్కువగా ఇక్కడ ఓటింగ్‌శాతం నమోదైంది. మరోవైపు నువ్వా..నేనా అన్నట్లు పోరు సాగిన చేవెళ్లలో 0.14శాతం పోలింగ్‌ పెరిగింది.  

పట్నంలో తగ్గిన పోలింగ్‌ 
ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తక్కువగా పోలింగ్‌ జరిగింది. ఈ రెండింటిలోనూ 2శాతం కంటే తక్కువ పోలింగ్‌ జరగడంతో ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందో అంతుచిక్కడం లేదు. హోరాహోరీగా పోరు సాగిన నేపథ్యంలో ప్రజానాడి ఏమిటో అంచనా వేయడం క్లిష్టంగా మారింది. మరోవైపు పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు గెలుపోటములను విశ్లేషించుకుంటున్నారు. ఓటింగ్‌ సరళిని మదింపు చేస్తూ బూత్‌లవారీగా తమ ఖాతాలో పడే ఓట్లను లెక్కిస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నమోదైన ఓటింగ్‌ శాతానికి అనుగుణంగా ఎవరికెన్ని ఓట్లు పోలవుతాయనేదానిపై అంచనాకొస్తున్నారు.

మరిన్ని వార్తలు