మంటగలిసిన మానవత్వం

26 Nov, 2017 03:36 IST|Sakshi
ఏశయ్యను ఎత్తుకుని వెళుతున్న కుమారుడు

అనారోగ్యం బారిన పడిన వృద్ధుడు 

ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోవాలాల నిరాకరణ 

 భుజాలపై ఎత్తుకుని బస్టాండ్‌కు తీసుకెళ్లిన కుమారులు

జనగామ: మానవత్వం మంటగలిసింది. ఆపదలో ఉన్నవారికి సాయం అందించాల్సిన మనుషులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా దూరమయ్యారు. ‘అన్నా.. మా నాన్న ఆరోగ్యం బాగా లేదు.. ఆటోకావాలి.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి..’ అని ఎంత బతిమిలాడినా ఎవరూ కనికరించలేదు. చేసేదేమీలేక విషమ పరిస్థితుల్లో ఉన్న తండ్రిని కుమారులు భుజాలపై ఎక్కించుకుని పరుగులు తీశారు. ఈ హృదయవిదారక ఘటన జనగామ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది.

జిల్లాలోని రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన సాగంటి ఏశయ్య ఉదయం అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారులు కుమార్, మణి జనగామ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఏశయ్యకు బీపీ పెరగడంతో డాక్టర్లు వరంగల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లమని రిఫర్‌ చేశారు. ఆస్పత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో కుమారులు తండ్రిని భుజాలపై ఎక్కించుకుని సిద్దిపేట రోడ్డు వద్దకు వచ్చారు. ‘మా నాన్నకు ఆరోగ్యం బాగా లేదు.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. అన్నా ప్లీజ్‌ రారా..’అని ఆటోవాలాలను బతిమిలాడారు. అయితే, ఏశయ్య పరిస్థితి చూసిన ఆటోవాలాలు ఎవరూ.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. మధ్యలో ఏదైనా జరిగితే తమకెందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో.. ఆటోవాలాలు ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక తండ్రిని ఇద్దరు కుమారులు చెరి కాసేపు జనగామ ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ఎత్తుకుని వెళ్లారు. అక్కడి నుంచి వరంగల్‌కు బస్సులో తీసుకువెళ్లడం స్థానికులను కలచివేసింది.  

మరిన్ని వార్తలు