గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్‌

22 Oct, 2023 09:40 IST|Sakshi

జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రతరం చేసింది. ఇక, ఇజ్రాయెల్‌ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దీంతో, అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వారంతా దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్‌ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.

మరోవైపు.. ఐరాస, అంతర్జాతీయ సంస్థల వారం రోజుల పై చిలుకు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గాజాకు సహాయ సామగ్రి అందించేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా ‘తలుపులు’ తెరుచుకున్నాయి. ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న పాలస్తీనా ప్రజల కోసం.. రఫా బార్డర్‌‌ పాయింట్‌‌‌‌ను ఈజిప్టు ఓపెన్ చేసింది. దీంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బోర్డర్‌‌‌‌ దాటాయి. పలు ట్రక్కులు గాజాలోకి ఎంటర్ అవుతున్న వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. కానీ,  20 ట్రక్కులను మాత్రమే అనుమతించారు.

ఇక, గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ రూట్ నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దీంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు.. రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో ట్రక్కులు వచ్చేందుకు ఇజ్రాయెల్​ ఓకే చెప్పింది. గాజా ప్రజలకు సాయం పంపిణీకి సంబంధించి రఫా బార్డర్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను యూఎన్​ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పరిశీలించారు. ‘ఇవి కేవలం ట్రక్కులు మాత్రమే కాదు.. గాజా ప్రజల లైఫ్‌‌లైన్. గాజాలోని ఎంతో మంది ప్రజల చావు – బతుకుల మధ్య వ్యత్యాసమే ఆ ట్రక్కులు’ అని ఆయన చెప్పారు.   

ట్రక్కుల్లోని సామగ్రిని చిన్న చిన్న మోటార్లపై తరలిస్తున్నారు.  వందలాది ట్రక్కు లు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. తినేందుకు, తాగేందుకు దిక్కులేక 23 లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు. ఉప్పు నీరు తాగి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు! గాజాలో పరిస్థితి ఘోర మానవీయ విపత్తు దిశగా సాగుతోందని ఐరాస ఆహార పథకం ఆందోళన వెలిబుచ్చింది.
 

మరిన్ని వార్తలు