అసెంబ్లీలో కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఫలితం శూన్యం

4 Oct, 2019 10:15 IST|Sakshi
సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీఎంఎస్‌ నాయకులు, వీఆర్‌ఎస్‌ కార్మికులు

1997 నుంచి వీఆర్‌ఎస్‌ కార్మికుల ఎదురుచూపులు..

వారసులకు ఉద్యోగం రాక దిక్కుతోచని స్థితిలో 3 వేల కుటుంబాలు

కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన కార్మికులు

సాక్షి, కొత్తగూడెం:  స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 3 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి యాజమాన్యం నిర్వాకంతో దయనీయ స్థితిలో బతుకులీడ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయా కుటుంబాల కన్నీటి గోసను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 21 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. ‘ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం’ అనే స్ఫూర్తిని యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తే.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిందని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.  1997లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పథకాన్ని ఎత్తేసింది. అయితే అప్పటికే వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద పదవీ విరమణ) పెట్టుకున్న సుమారు 3 వేల మంది కార్మికులు తమ పరిస్థితి ఏంటని సింగరేణి యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో సదరు కార్మికులు 15 ఏళ్ల  సర్వీసు, వేతనం వదులుకుని న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.

డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా.. ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం తీరును డిప్యూటీ సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇన్నేళ్లుగా వీరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించగా సింగరేణి యాజమాన్యం వద్ద సమాధానం లేదు. 1997లో ఈ పథకాన్ని రద్దు చేసినప్పుడు.. కొత్త గనులు ఏర్పాటు చేసినా, సంస్థలో ఉద్యోగాలు ఖాళీ అయినా అప్పటికే వీఆర్‌ఎస్‌ పెట్టుకున్న కార్మికుల వారసులను నియమిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో కొందరికి మైన్స్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ కూడా  ఇచ్చింది. వారికీ ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాగా, మూడు నెలల్లో ఉద్యోగాలు ఇప్పించి కార్మికుల భవిష్యత్తును  మారుస్తామని 2016లో టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సైతం శాసనసభలో హామీ ఇచ్చారు. అయితే నేటికీ వారికి న్యాయం జరుగలేదు. దీంతో కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

సీఎం హామీలను నెరవేర్చాలి 
సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి. టీబీజీకెఎస్‌ నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికల ముందు వీఆర్‌ఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు జరిగి రెండేళ్లయినా అతీగతీ లేదు. నేడు ఆయా కార్మికుల   పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగావÔకాశాలు కల్పించాలి. 
– చింతల సూర్యనారాయణ, బీఎంఎస్‌ అధ్యక్షుడు 

ప్రభుత్వానివి మోసపూరిత వాగ్దానాలే 
వీఆర్‌ఎస్‌ ఉద్యోగులు సుమారు 21 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై అనేక హామీలు గుప్పించి ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం సరైంది కాదు. సింగరేణి యాజమాన్యం ఆర్‌ఎస్‌సీ వద్ద వీఆర్‌ఎస్‌ విషయంలో నోరుమెదపకపోవడం దారుణం. ప్రభుత్వ వైఖరితో 3000 మంది కార్మికులు అర్ధాకలితో అలమటిçస్తున్నారు. 
– పి.మాధవనాయక్, బీఎంఎస్‌ కార్యదర్శి 

48 రోజులు ఎంవీటీసీ చేయించుకున్నారు 
1997లో మా నాన్న అన్‌ఫిట్‌ అయి నాకు 48 రోజులు మైన్స్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. మా బ్యాచ్‌లో 16 మందిలో 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వారికి నేటికీ ఇవ్వలేదు. సింగరేణి అధికారులు 2002లో పిలిచి రూ. రెండు లక్షలు ఇస్తాం.. ఉద్యోగం లేదన్నారు. అయితే నాకు ఉద్యోగమే కావాలన్నాను. సింగరేణి భవన్, హెడాఫీస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.
– మబ్బు శంకర్, వీఆర్‌ఎస్‌ కార్మికుడి కుమారుడు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు