-

ముగ్గురూ పాత ప్రత్యర్థులే..!

24 Nov, 2018 14:14 IST|Sakshi
ఓటరును అభ్యర్థిస్తున్న కూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, ప్రచారంలో చిన్నారిని ఎత్తుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి, ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ భూక్యా ప్రసాదరావు

సాక్షి, దమ్మపేట: నియోజకవర్గంలో ప్రధాన పక్షాల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలి.. వారి నుంచి ఓట్లు ఎలా రాబట్టుకోవాలి.. అని, ఆయా అభ్యర్థులు, నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలను పన్నుతున్నారు. ఎలాగైనా అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ధోరణితో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మహాకూటమి నుంచి టీడీపీ నాయకుడు మెచ్చా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి డాక్టర్‌ భూక్యా ప్రసాదరావు, సీపీఎం నుంచి తానం రవీందర్‌ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో శుక్రవారం నుంచి గ్రామాల్లో ప్రచారం వేడి–వేగం పెరిగింది.

2009లో ఏర్పడ్డ అశ్వారావుపేట గిరిజన శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి వగ్గెల మిత్రసేన, సీపీఎం అభ్యర్థి పాయం వెంకయ్యపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై వైఎస్‌ఆర్‌ కాం గ్రెస్‌ నుంచి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థ్ధిగా పోటీలో ఉన్న డాక్టర్‌ భూక్యా ప్రసాదరావు ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.ప్రస్తుత ఎన్నికల బరిలో మూడు ప్రధాన పార్టీల నుంచి పాత ప్రత్యర్థులే (మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ భూక్యా ప్రసాదరావు) తలపడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
మళ్లీ మేమే అంటున్న టీఆర్‌ఎస్‌.. 
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన తాటి వెంకటేశ్వర్లు, ఏడాది లోపే టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే గెలుస్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
మార్పు తప్పదంటున్న కూటమి
కాంగ్రెస్‌ సీనియర్లను కాదని మహాకూటమి పొత్తుల్లో అనూహ్యంగా  టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు టికెట్‌ దక్కించుకున్నారు. గత ఎన్ని కల్లో స్వల్ప ఓట్లతో ఓడిన టీడీపీ ఈసారి ఇక్కడ నుంచి గెలుస్తామనే ధీమాతో ఉంది. ఈసారి ప్రజ లు సైతం మార్పును కోరుకుంటున్నారని టీడీపీతోపాటు మహాకూటమి నాయకత్వం భావిస్తోంది. దీనికి తోడు ఇటీవల నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్, టీడీపీల్లోకి వలసలు పెరిగాయని, మహాకూటమి కి ఆదరణ వచ్చిందని, ఈసారి విజయం తమదేనని కూటమి నాయకత్వం ధీమాతో ఉంది. 
బీజేపీ గాలం.. 
బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. టీఆర్‌ఎస్, టీడీపీ అభ్యర్థులది ఒకే గిరిజన సామాజిక వర్గం. బీజేపీ  అభ్యర్థి భూక్యా ప్రసాదరావుది వేరొక సామాజిక వర్గం. టీఆర్‌ఎస్, టీడీపీ/కూ టమిలోని తన సామాజిక వర్గం వారంతా తనకే ఓటు వేస్తారని భూక్యా ప్రసాద్‌ భావిస్తున్నారు. ఆ ఓట్లకు గాలం వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు