వామ్మో ‘పులి’..!

19 Feb, 2015 07:51 IST|Sakshi
వేలూరు అటవీ ప్రాంతంలో రైతులు

వర్గల్: పులి తిరుగుతుందంటూ వదంతులు వ్యాపించడంతో మెదక్ జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామ రైతులకు మూడు రోజులుగా కంటికి కునుకులేకుండా పోయింది. బుధవారం ఉదయం పులిని చూసానంటున్న ప్రత్యక్ష సాక్షి మాటలు, వ్యవసాయ పొలాల పక్కన అడవి మార్గంలో పాద ముద్రలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వివరాలు..

గ్రామానికి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో అడవి సరిహద్దులో రైతుల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. తోటలు, ఇతర పంటలు సాగు చేస్తూ తమ పశువులను అక్కడే కట్టేసి రాత్రిళ్లు ఇళ్లకు చేరుకుంటారు. మూడు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు పుకార్లు వచ్చాయి. వీటికి తోడు సోమవారం మల్లన్నగుట్ట ప్రాంతంలో తిని వదిలేసిన ఓ అడవి పంది కళేబరాన్ని గమనించారు. మంగళవారం పటేల్ చెరువు సమీప అటవీ ప్రాంతంలో పులి గాండ్రింపులు వినపడినట్లు రైతులు చెప్పారు.

తాజాగా బుధవారం ఉదయం బాపయ్య చెరువు అటవీ ప్రాంతం పక్కనే ఉన్న తన పొలానికి వచ్చిన రైతు ఉప్పరి నరసింహులుకు పులి కనబడడంతో భయంతో ఊళ్లోకెళ్లి చెప్పాడు. కొందరు అటవీ ప్రాంతంలో గాలింపు జరపగా పాద ముద్రలు కన్పించాయి. దీంతో ఇక్కడ పులి సంచా రం నిజమే అనే భయం రైతుల్లో ఆవరించింది.

పాదముద్రలు పరిశీలించిన అటవీ బృందం
వేలూరు వ్యవసాయ పొలాల ప్రాంతాన్ని ములుగు, మీనాజీపేట ఫారెస్టు బీట్ అధికారులు ఆజం హుస్సేన్, సాదత్ మియా పరిశీలించారు. పాద ముద్రలు తీసుకున్నారు. వీటిని పరిశీలిస్తే ‘హైనా’ను పోలి ఉన్నాయని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు