భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య

7 Jun, 2014 02:26 IST|Sakshi
భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య

వరకట్నపు వేధింపులకు మరో అబల బలైంది. రైల్వే ఉద్యోగమని అధిక కట్నం ఇచ్చినా భర్త దాహం తీరలేదు. పిల్లలు పుట్టరని, అదనంగా మరో రూ.5 లక్షల కట్నం తేవాలని లేకుంటే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరించడంతో మనస్తాపం చెందిన భార్య పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సుల్తానాబాద్ ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన పెర్క స్వర్ణలత(28) వివాహం రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైల్వే జీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అంజయ్యతో జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివాహ సమయంలో భారీగా కట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. ఏడాది క్రితం వీరికి బాబు పుట్టి చనిపోయాడు. ఈ క్రమంలో స్వర్ణతల కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యులు ఆమె గర్భసంచి తొలగించారు. అప్పటి నుంచి స్వర్ణలతకు వేధింపులు మొదలయ్యాయి. పిల్లలు పుట్టే అవకాశం లేనందున అదనంగా మరో రూ.5 లక్షల కట్నం తెస్తేనే కాపురం చేస్తానని భర్త అంజయ్య వేధించసాగాడు.

దీంతో బాధితురాలు సుల్తానాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఖాజీపేటలో విధులు నిర్వహిస్తున్న భర్తను పోలీసులు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. పుట్టింట్లోనే ఉన్న భార్యను శుక్రవారం కాపురానికి తీసుకెళ్తానని చెప్పిన అంజయ్య గురువారం రాత్రి ఫోన్ చేసి దూషించాడు. రెండో పెళ్లి చేసుకుంటానని తెగేసిచెప్పాడు. అడ్డుకుంటే కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపంచెందిన స్వర్ణలత శుక్రవారం క్రిమిసంహారక మందుతాగింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు తండ్రి న్యాతరి రాజయ్య ఫిర్యాదు మేరకు భర్త అంజయ్య, అత్త లక్ష్మి, మామ లింగయ్య, ఆడబిడ్డలు లత, సునీత, మమతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని డీఎస్పీ వేణుగోపాల్‌రావు, సీఐ సత్యనారాయణ, తహశీల్దార్ రమాదేవి పరిశీలించి పంచనామా నిర్వహించారు.
 
 

>
మరిన్ని వార్తలు