ప్రొఫెసర్ల తీరు మారేనా!

14 Oct, 2014 03:45 IST|Sakshi
ప్రొఫెసర్ల తీరు మారేనా!

* వైద్య కళాశాలకు తరుచూ గైర్హాజరు
* తీవ్రంగా పరిగణిస్తున్న కలెక్టర్
* నేడు వైద్యాధికారులతో సమీక్ష
* సెలవులో వెళ్లిన ప్రిన్సిపల్

నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాల పనితీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యసేవలు మెరుగు పర్చేందుకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించనున్నారు. మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై నివేదికను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జిజియాబాయి రెండు రోజులపాటు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం నిర్వహించిన సమీక్షలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. సమీక్ష సమావేశానికి 12 మంది ప్రొఫెసర్లు గైర్హాజరు కావడాన్ని తీ వ్రంగా పరిగణించిన కలెక్టర్ తనను కలిసేంత వరకు విధులలో చేరవద్దని ఆదేశించారు. దీంతో  గైర్హాజరయిన ప్రొఫెసర్లు కలెక్టర్ తీసుకునే చర్యల నుంచి తప్పించుకునే పనిలో పడ్డారు. యూనివర్సిటీ, డీఎంఈ కార్యాలయాలలో ప్రత్యేక పనులు ఉన్నందున కలెక్టర్ సమీక్షకు గైర్హాజరు అయినట్లు పత్రాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరి కొందరు అనారోగ్యం పేరిట మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని తెలిసింది. స్థానికంగా ఉండడానికి ఇష్టపడని కొందరు ప్రొఫెసర్లు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
 
గతంలోనూ
వైద్య ఆరోగ్య శాఖలో 16 మంది వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, తరుచూ గైర్హాజరవుతున్నారని గత కలెక్టర్ ప్రద్యుమ్న వారి హెచ్‌ఆర్‌ఏను నిలిపి వేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ హెచ్‌ఆర్‌ఏ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఖంగుతిన్నారు. అయితే, అంతలోనే కలెక్టర్ బదిలీ కావడంతో ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.

శాఖలోని ఓ అధికారి పర్సంటేజీల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తే హెచ్‌ఆర్‌ఏ విడుదల చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వైద్యులు ఒప్పుకోవడమే ఆలస్యం ఇన్‌చార్జి కలెక్టర్‌ను బురిడీ కొట్టించి హెచ్ ఆర్‌ఏ విడుదల చేయించుకున్నారు. వైద్యుల పని తీరు బాగోలేదని కలెక్టర్ హెచ్‌ఆర్‌ఏను నిలపి వేస్తే అధికారులు ఇన్‌చార్జి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి నిధులు మం జూరు చేయించుకోవడం గమనార్హం. ఈ విషయమై  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గోవింద్‌వాగ్మోరేను వివరణ కోరగా స్పందించలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా