పర్యాటకం టర్నోవర్ రూ.100 కోట్లు..

10 Dec, 2014 03:33 IST|Sakshi
పర్యాటకం టర్నోవర్ రూ.100 కోట్లు..

టీ పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం
 ఐదు కోట్ల నికరలాభం కోసం యత్నం
 కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
 కార్పొరేషన్ బోర్డు సమావేశంలో నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థను కొత్త పుంతలు తొక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో నూతన పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు, గతంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక ప్రాంతాలకూ పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 100 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే.. తెలంగాణ ప్రాంతాల నుంచి టర్నోవర్ రూ. 60 కోట్లకు పైగా చేరినట్లు అధికారవర్గాలు వివరించాయి. దీనిని మరింత పెంచి రూ.5 కోట్ల నికర ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
 కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం 45 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా... ఇటీవలే తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య వివరించారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు జిల్లాల్లో ఉన్న ఆస్తుల పరిరక్షణ, కొత్త ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రస్తుతం రెండు జిల్లాలకు ఒక డివిజనల్ మేనేజర్ ఉన్నారని, ఇకపై ప్రతి జిల్లాకు ఒక మేనేజర్‌ను నియమించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. వీరికి అత్యవసర మరమ్మతులు ఇతర కార్యక్రమాల కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యయం చేయడానికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌కు ప్రధాన పర్యాటక కేంద్రం వద్ద ఈ మేనేజర్లు ఉంటార ని పేర్కొన్నారు. పర్యాటక పరంగా జిల్లాల్లోని పర్యాటక శాఖ అధికారులకు, కార్పొరేషన్ అధికారుల మధ్య వీరు సమన్వయం చేస్తారు.

మరిన్ని వార్తలు