హోర్డింగ్‌ డేంజర్‌

24 Apr, 2019 08:34 IST|Sakshi

నగరానికి టవర్లు, హోర్డింగ్‌ల గండం  

నాణ్యత పరిశీలనలో యంత్రాంగం విఫలం  

అనధికారికంగా వెలసినా తనిఖీలు శూన్యం  

‘ప్రమాద రహిత హోర్డింగ్‌ పాలసీ’పై నిర్లక్ష్యం  

ఫ్లెక్సీలతోనూ ‘మెట్రో’కు తరచూ అంతరాయం  

ఎల్‌బీ స్టేడియంలోని టవర్ల మన్నికపై స్పోర్ట్స్‌ అథారిటీకి జీహెచ్‌ఎంసీ నోటీసులు  

సెల్‌టవర్ల సర్వీస్‌ ప్రొవైడర్లకు సైతం  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టవర్లు, హోర్డింగ్‌లతో ప్రమాదం పొంచి ఉంది. తక్కువ వేగంతో వీస్తున్న గాలులకే ఇవి కుప్పకూలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటి నిర్మాణ నాణ్యత, మన్నిక పరిశీలనలో జీహెచ్‌ఎంసీ విఫలమవుతోంది. ఫలితంగా ప్రజా భద్రత గాలిలోదీపమవుతోంది. తాజాగా సోమవారం కురిసిన గాలివానకు ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ల టవర్‌ కూలి ఓ వ్యక్తి మరణించడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో దాదాపు 2,600 హోర్డింగ్‌లు ఉండగా... వీటిలో కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసినవి కావడంతో అవి ఎప్పుడు కూలుతాయోన ని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. 2016లో జూబ్లీహిల్స్‌లో ఓ భారీ హోర్డింగ్‌ యూనిపోల్‌ కుప్పకూలడం తో నగరంలో నూతన హోర్డింగ్‌లకు అనుమతులు నిషేధించారు.

అయితే వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళనలు చేయడంతో షరతులతో కూడిన అనుమతులు మంజూ రు చేయాలని నిర్ణయించారు. ఈ నిబంధ నల ప్రకారమే 2017 నుంచి హోర్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొన్ని నిబంధనలు కాగితాలకే పరిమితమవడం గమనార్హం. మరోవైపు హోర్డింగ్‌లకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు గాలులు వీచినప్పుడు ఎగిరిపడి మెట్రోరైలు మార్గంలోని ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడుతుండడంతో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల బాలానగర్‌లో, అంతకుముందు తార్నాక, మెట్టుగూడ, బేగంపేట్, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. 

పాలసీపై నిర్లక్ష్యం...  
గ్రేటర్‌లో హోర్డింగ్‌లతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘హోర్డింగ్‌ ఫ్రీ సిటీ’గా మారుస్తామని గతంలో మున్సిపల్‌ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటీఆర్‌ ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నగరంలో ప్రస్తుతమున్న 2,600 హోర్డింగ్‌ల నాణ్యత, మన్నిక ఎలా ఉందనే అంశంపై జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో పరీక్షించే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగళూర్‌ తరహాలో ‘ప్రమాద రహిత హోర్డింగ్‌’ పాలసీ విధివిధానాలు రూపొందించడంలోనూ మున్సిపల్, బల్దియా యంత్రాంగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. 

జీహెచ్‌ఎంసీ నోటీసులు...  
ఎల్బీ స్టేడియంలో ఉన్న ఫ్లడ్‌లైట్‌ టవర్ల స్ట్రక్చరల్‌ స్టెబిలిటీపై తక్షణం నివేదిక సమర్పించాలని తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీకి జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. సోమవారం రాత్రి కురిసిన గాలివానకు స్టేడియంలోని ఫ్లడ్‌లైట్‌ టవర్‌ కూలి ఒకరు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు టవర్ల స్టెబిలిటీపై జేఎన్‌టీయూ, ఉస్మానియాకు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులతో అధ్యయనం చేయించి, తక్షణం నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఆదేశించారు. మిగిలిన మూడింటిలో ఏదైనా టవర్‌ బలహీనంగా ఉన్నట్లు నివేదికలో తేలితే వెంటనే తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నగరంలో హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ స్ట్రక్చరల్‌ స్టెబిలిటీపై గతేడాది పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రధాన మార్గాల్లోని హోర్డింగ్‌లపై ఫ్లెక్సీలను తొలగించాలని ఆయా ఏజెన్సీలకు కమిషనర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా గ్రేటర్‌లోని అన్ని సెల్‌టవర్ల మన్నిక సామర్థ్యం (స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ)పై తక్షణం నివేదిక ఇవ్వాలని ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈదురు గాలులకు హోర్డింగ్‌లు, టవర్లు కూలుతున్న నేపథ్యంలో ఈ నోటీసులిచ్చింది. నగరంలోని అన్ని సెల్‌టవర్ల స్ట్రక్చరల్‌ స్టెబిలిటీపై నిపుణులైన ఇంజినీర్లు లేదా ఉస్మానియా, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విభాగాలతో పరీక్షించి నివేదికలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చింది.  

కాగితాల్లోనే నిబంధనలు...   
గోడలకు, భూమి మీద ఏర్పాటు చేసే హోర్డింగ్‌ల సైజు 40 గీ25 ఫీట్లు మాత్రమే ఉండాలి.  
రూఫ్‌టాప్‌ మీద పెట్టేవి రెండంతస్తుల ఎత్తు మించరాదు. వీటి పరిమాణం కూడా 30 గీ25 మాత్రమే ఉండాలి.  
తాము ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లతో ఎలాంటి ప్రమాదాలు జరగబోవని సదరు ఏజెన్సీ అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి.
హోర్డింగ్‌ ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో నిర్మాణ నాణ్యతను పరీక్షించాలి.  
గ్రేటర్‌లో అనధికారికంగా 330 భారీ హోర్డింగ్‌లు ఉన్నట్లు 2016లో గుర్తించారు. వీటిలో 300 వరకు 2018లో తొలగించారు. అయితే ఆ తర్వాత ఎక్కడ? ఎన్ని? అనధికారిక హోర్డింగ్‌లు వెలిశాయనేది బల్దియా యంత్రాంగం గుర్తించకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు