కేసీఆర్‌ మొండివైఖరి వీడాలి

12 Oct, 2019 22:15 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కేసీఆరే బాధ్యత వహించాలని.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని..వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని తెలిపారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని.. పోరాడి సాధించుకుందామని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ మొండి వైఖరి వీడి.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

కార్మికుల ఆకలిబాధలు కనిపించడం లేదా..?
ఆర్టీసీ కార్మికులు ఆకలి బాధలు కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘దసరా పండుగ నాడు ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారని.. కేసీఆర్ మాత్రం కుటుంబంతో సంతోషంగా పండుగ చేసుకున్నారని’ ధ్వజమెత్తారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది..అన్ని వర్గాలు సంతోషంగా ఉండటానికి అని..ఆత్మహత్యల కోసం కాదన్నారు. ఆత్మహత్యలు ఆగాలనే సోనియా తెలంగాణ ఇచ్చారని.. కానీ  కేసీఆర్ అసమర్థ పాలనతో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు