ఆర్మీ ర్యాలీలో ‘సింగరేణి’ ప్రతిభ 

15 Oct, 2019 10:42 IST|Sakshi
సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు (ఫైల్‌)

శరీర దారుఢ్య పరీక్షలో 107 మంది ఎంపిక 

రెసిడెన్షియల్‌ తరహాలో శిక్షణ ఇచ్చిన సేవా సమితి  

సింగరేణి(కొత్తగూడెం)/గోదావరిఖని: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన యువత అధిక సంఖ్యలో అర్హత సాధిస్తోంది. సింగరేణి సంస్థవ్యాప్తంగా 450 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం–2 ఏరియాల రీజినల్‌ క్యాంపుల్లో శిక్షణనిచ్చింది. వీరిలో 240 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. కరీంనగర్‌లో ఈ నెల 7న ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ 17వ తేదీ వరకు జరగ నుంది. సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకులు.. ఈ నెల 13వ తేదీ వరకు శరీర ధారుడ్య పరీక్షకు187 మంది హాజరు కాగా 107 మంది అర్హత సాధించారు. శ్రీరాంపూర్‌ రీజియన్‌ నుంచి 66 మంది హాజరుకాగా 43 మంది, ఆర్జీ–2 రీజియన్‌ నుంచి 65 మంది హాజరుకాగా 38 మంది, కొత్తగూడెం రీజియన్‌ నుంచి 56 మంది హాజరుకాగా 26 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మెడికల్‌ పరీక్షకు ఎంపికయ్యారు.

మిగిలిన ఐదు రోజుల్లో మరో 50 మంది సింగరేణి అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. దశలవారీగా నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇప్పటికే సింగరేణి ప్రాంత యువత 30 మంది ఎంపికయ్యారని కోఆర్డినేషన్‌ జీఎం ఆంటోనిరాజా వెల్లడించారు. ఆర్మీ ర్యాలీలో ఎంపికైన అభ్యరులకు నవంబర్‌ 24వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ‘సింగరేణి’అభ్యర్థులకు ఆర్జీ–2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీలో ఈ నెల 20వ తేదీ నుంచి రెసిడెన్షియల్‌ తరహాలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్తిస్తామని అధికారులు తెలిపారు. 
    

మరిన్ని వార్తలు