నేడో, రేపో బదిలీలు

13 Oct, 2018 14:27 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులకు స్థానచలనం కలుగనుంది. ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి రావడంతో ఒకే చోట తిష్టవేసిన రెవెన్యూ, పోలీసు, ఎంపీడీఓలను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్దేశించింది. డిసెంబర్‌ 31వ తేదీ నాటికి జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల జాబితా  పంపాలని లేఖ రాసింది. ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న రెవెన్యూ(రిటర్నింగ్‌/అసిస్టెంట్‌ రిటర్నింగ్‌) అధికారుల వివరాలను జిల్లా యంత్రాంగం పంపింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం.. కోడ్‌ అమలులోకి రావడంతో ఈ నెల 17వ తేదీలోపు వీరిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.
 
ఎంపీడీఓలకు కూడా.. 
ఎన్నికల బదిలీలు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు(ఎంపీడీఓ) కూడా వర్తించనున్నాయి. దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ గత ఎన్నికల వేళ ఎంపీడీఓలను బదిలీ చేయడం, తాజాగా ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల ప్రస్తావన తేవడంతో ఎంపీడీఓలకు కూడా స్థానచలనం కలుగనుందనే ప్రచారం జరుగుతోంది. బీడీఓల వ్యవస్థ  రాష్ట్రంలో లేనందున ఆ స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓలలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. కాగా, మూడేళ్ల పైబడి జిల్లాలో పనిచేస్తున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో మూడో వంతు ఎంపీడీఓల పీఠాలు కదలనున్నాయి. కొన్నేళ్లుగా పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలపై నిషేధం కొనసాగుతుండడంతో భారీ స్థాయిలో బదిలీలు అయ్యే అవకాశముంది. ఎన్నికల అనంతరం ప్రస్తుత మండలాల్లోనే కొలువుదీరే వెసులుబాటు ఉండడంతో అధికారుల్లో పెద్దగా ఆందోళన కలగడం లేదు. ఇదిలావుండగా, ఇటీవల పోలీసుశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఎన్నికల కోడ్‌ రావడంతో హోంశాఖ ఈ మేరకు సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులకు స్థానచనలం కలిగించింది. 

జాబితాకు తుదిమెరుగు

ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాతృ జిల్లాలో పనిచేస్తున్న, మూడేళ్లుగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు స్థానచలనం కలుగనుంది. మూడేళ్ల కాలపరిమితిలో పదోన్నతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 17 మంది రెవెన్యూ అధికారులకు బదిలీ అనివార్యం కానుంది. కాగా, ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రభావం చూపే అధికారుల జాబితాను పరిశీలిస్తున్న పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో జిల్లాలవారీగా తహసీల్దార్లను కేటాయించేందుకు తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూపొందించిన జాబితాను జిల్లా యంత్రాంగానికి అందగానే బాధ్యతల నుంచి అధికారులు రిలీవ్‌ కావాల్సి వుంటుంది. ఇదిలావుండగా, గండిపేట, రాజేంద్రనగర్, యాచారం, ఆమనగల్లు, చౌదరిగూడ, షాబాద్, శంకర్‌పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్, మహేశ్వరం, మాడ్గుల, తలకొండపల్లి మండలాల తహసీల్దార్లతోపాటు కలెక్టరేట్‌లో తహసీల్దార్‌ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు అధికారులకు మార్పు తప్పనిసరి అయింది.

మరిన్ని వార్తలు