వ్యాధులతో గిరిజనులు విలవిల!

8 Sep, 2014 23:29 IST|Sakshi

టేక్మాల్: సీజనల్ వ్యాధులతో  గ్రామీణ ప్రాంత ప్రజలు విలవిలాడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు వ్యాధులతో వణికిపోతున్నారు.  సమయానికి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట మదిర నల్లకుంట తండాకు చెందిన గిరిజనులంతా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న సంఘటన సోమవారం ఆలస్యంగా  వెలుగు చూసింది.

తండాకు చెందిన దేవీసింగ్ (50) దోలీబాయి (40), ఇఠ్యానాయక్ (32),అంబ్యా నాయక్ (55), చాందిబాయి(40), దుమ్యా నాయక్ (54) సేవ్యానాయక్(24), ప్రవీణ్, వైష్ణవి, చరణ్, సునీత, శ్రీకాంత్, శ్రావణ్, రోహిత్, శ్రీలత తదితరులు (పది సంవత్సరాల లోపు చిన్నారులు) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారంతా జ్వరంతో, నొప్పులతో బాధపడుతూ మంచం పట్టారు. రోగాలు చిన్నారులకు ఎక్కువగా సోకడంతో పాఠశాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు గత నాలుగు రోజులుగా వెళ్లడం లేదని ండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలోని నల్లాలు, చేతిపంపులు, జెట్ పంపుల చుట్టూ,  ఇళ్ల చుట్టూ మురికి నీరు పేరుకుపోయింది.

 కాలువల్లో నీరంతా ఎక్కడి కక్కడ దుర్గధం వెదజల్లుతోంది.  తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో నీరంతా కలుషితమై, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది పలువురు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పలుమార్లు  వైద్యాధికారులు ఫిర్యాదు చేసినా వారు తొంగి చూసిన పాపాన పోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న పాపన్నపేట మండలంలోని నార్సింగ్, శంకరంపేట, టేక్మాల్, మెదక్ తదితర పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్  ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నామన్నారు.

దీంతో విపరీతమైన డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టి వైద్య సేవలను అందించాలని గిరిజనులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు