కాంగ్రెస్‌ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ

8 Nov, 2023 07:16 IST|Sakshi

సీఐసీ ఎంపిక సమావేశానికి  హాజరు కాలేదు  

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అభ్యర్థీత్వాన్ని వ్యతిరేకించింది  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం  

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం

సిద్ధి/సూరజ్‌పూర్‌:  విపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. నూతన ముఖ్య సమాచార కమిషనర్‌(సీఐసీ)గా హీరాలాల్‌ సమారియా ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్‌ హాజరు కాలేదని ఆక్షేపించారు. ఆయన దళితుడు కావడమే ఇందుకు కారణమని అన్నారు.

సీఐసీగా నియమితుడైన తొలి దళితుడు హీరాలాల్‌ను కాంగ్రెస్‌ నేతలు నిత్యం దూషిస్తున్నారని మోదీ విమర్శించారు. దేశంలో మొట్టమొదట గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అభ్యర్థీత్వాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఆ పార్టీ మైండ్‌సెట్‌ను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో, ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు.

తనను రోజంతా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు. కానీ, వారు ఓబీసీ వర్గాలను తిడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడన్న సంగతి తెలిసిందే. దళితులు, గిరిజనులు, ఓబీసీల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఆయా వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తోందని తెలిపారు.

2014లో తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని రకాల కుంభకోణాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అలా పొదుపు అయిన డబ్బుతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్‌ సరుకులు ఇస్తున్నామని వివరించారు.  

కాంగ్రెస్‌ పాలనలో నేరాలు, లూటీలు  
కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు బలం పుంజుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే, దేశమంతటా బాంబు పేలుళ్లు, హత్యల వార్తలు నిత్యం వస్తుంటాయని చెప్పారు. నేరాలు, లూటీలు విచ్చలవిడిగా జరుగుతుంటాయని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నక్సలిజాన్ని అరికట్టడంలో దారుణంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ బాగోతంపై విచారణ జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. ఈ కుంభకోణంలో ఎంతటి బడా బాబులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భద్రత అనేది ప్రతి పౌరుడికి అవసరమని మోదీ చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.  

మరిన్ని వార్తలు