నేడు గులాబీ దళపతి రాక

28 Nov, 2018 10:00 IST|Sakshi
కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ శివారులో సిద్ధమైన సభా వేదిక 

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ సుడిగాలి ప్రచారం

ఐదు నియోజకవర్గాల్లో ఆశీర్వాద సభలు 

భారీ జన సమీకరణకు ఏర్పాట్లు 

పటిష్ట పోలీసు బందోబస్తు

సభా వేదికలను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ఉమ్మడి జిల్లాలో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకే రోజు జిల్లాలో ఇన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి ప్రచారాన్ని ఊపుమీదకు తేనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించి అక్కడి నుంచి జహీరాబాద్‌కు మధ్యాహ్నం 1.15 గంటలకు, సంగారెడ్డిలో 2గంటలకు, అందోల్‌లో 2.45 గంటలకు, నర్సాపూర్‌లో 3.30 గంటలకు జరగనున్న ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌   పాల్గొంటారు.

ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ఊపులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సభలు పార్టీ నేతలు, శ్రేణులను ఉత్తేజరపర్చనున్నాయి. మొదటి విడత ప్రచారంలో హుస్నాబాద్, సిద్దిపేట, మెదక్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. రెండో విడత కింద నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ప్ర చారం నిర్వహించతలపెట్టారు. ఉమ్మడి జిల్లాలో మిగిలిపోయిన పటాన్‌చెరు, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 1న సభలను నిర్వహించే అవకాశం ఉంది. బుధవారం జరిగే సభలకు సంబం ధించి సభా వేదిక ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ల ఏర్పాట్లను మంగళవారం రాత్రి సంగారెడ్డిలోని నాగాపూర్‌రోడ్డు, జహీరాబాద్‌లోని పస్తాపూర్‌ రహదా రుల వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికలను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సీఎం సభల నిర్వహణ సందర్భంగా వేదికపై ఎవరెవరు ఉండాలనే దాని పై సైతం పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ, ప్రధాన నేతలకు సూచనలు చేశారు.

సీఎం సభల సందర్భం గా భద్రతా చర్యల విషయమై ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే సభా వేదికల వద్ద అవసరం మేరకు పోలీసు సిబ్బందిని నియమించి బాధ్యతలు అప్పగించారు. ఒకేరోజు ఐదు సభల ను నిర్వహించడం ద్వారా ఓటర్లలో ఊపు తీసుకురావడంతో పాటు ఎన్నికల వరకల్లా ఇదే ఊపును కొనసాగించేందుకు వీలుగా టీఆర్‌ఎస్‌ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీఆర్‌ సభలు ముగి సిన తర్వాత కూడా ప్రచారంలో ఏ మాత్రం ఊపు తగ్గకుండా ఉండేందుకు ఇప్పటికే అభ్యర్థులు, ప్రధాన నేతలకు దిశా నిర్దేశం చేశారు.

సర్వం సిద్ధం

సభలకు 30 వేల నుంచి 50 వేల మంది వరకు జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకేరోజు ఐదు సభలు ఉండడంతో జన సమీకరణ కోసం అవసరం మేరకు వాహనాలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అందుబాటులో ఉన్న వాహనాలు, లారీలను సైతం సమకూర్చుకుంటున్నారు. పక్క జిల్లాల నుంచే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి సైతం వాహనాలను సేకరించుకున్నారు. మొత్తం మీద జిల్లాలో కేసీఆర్‌ ఎన్నికల సభలను నిర్వహిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం  సంతరించుకుంది. ఎన్నికల నాటికల్లా ఏ మాత్రం పార్టీ శ్రేణుల్లో ఊపు తగ్గకుండా కార్యక్రమాలను నిర్వహించే ప్రణాళికలను పార్టీ సిద్ధం చేస్తోంది.  

మరిన్ని వార్తలు