చల్లారేదెన్నడు ?

2 Oct, 2018 09:02 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: వేగంగా దూసుకెళ్లాలని ఉవ్విళ్లూ రుతున్న ‘కారు’కు అసమ్మతి నేతలు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అసెంబ్లీ రద్దు చేసిన వెనువెంటనే బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని భావించిన టీఆర్‌ఎస్‌కు ఈ అంశం మింగుడు పడటం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, కల్వకుర్తి, షాద్‌నగర్, అలంపూర్‌ నియోజకవర్గాల్లో అసమ్మతి చిచ్చు రగిలింది. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు టీఆర్‌ఎస్‌ ముఖ్యలైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జోక్యం చేసుకోవడంతో అసమ్మతి గళం సద్గుమణిగినట్లు కనిపించింది.

అయితే ఒక్క అలంపూర్‌ మినహా మిగతా చోట్ల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. స్వయంగా పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి ‘అసమ్మతి నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రచారంలో నిమగ్నం కావాలి.. ఏ ఒక్క గంటను కూడా వృథా చేయడానికి వీలులేదు. అసమ్మతి నేతలు లేరనుకుని ప్రచారంలో ముందుకు సాగండి’ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు కొండంత ధీమా వచ్చినట్లయింది.

అభ్యర్థులను మార్చేది లేదు.. 
విపక్షపార్టీలకు చిక్కకుండా వేగంగా దూసుకెళ్లాలని భావించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అక్కడక్కడా అసమ్మతి నేతలు బ్రేకులు వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తుండగా.. మరికొన్ని చోట్ల ద్వితీయశ్రేణి నాయకత్వం పార్టీని వీడుతోంది. మక్తల్, కల్వకుర్తిలో అభ్యర్థులను మార్చాలనే డిమాండ్‌ కొనసాగుతుండగా.. అచ్చంపేట, దేవరకద్ర తదితర చోట్ల ద్వితీయశ్రేణి నేతలు పార్టీని వీడారు. అచ్చంపేట నియోజకవర్గానికి పలువురు కీలక నేతలు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని పరిస్థితులు పార్టీ అధిష్టానానికి చికాకు తెచ్చి పెడుతున్నాయి.
 
నష్టనివారణకు... 

అభ్యర్థుల విషయమై అసంతృప్తి విషయంలో నష్టనివారణ చర్యల కోసం పార్టీకి చెందిన ముఖ్యులు కొంత కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా పలు దఫాలు అసంతృప్తులతో చర్చలు జరిపారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల విషయమై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే టికెట్‌ ప్రకటించినట్లు నేతలకు సర్దిచెబుతున్నారు. అభ్యర్థుల విషయంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న తుది నిర్ణయానికి అందరూ కట్టుబడి పార్టీ కోసం పనిచేయాలని హితబోధ చేశారు. పార్టీలో ఉన్న వారికి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని... భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో కొందరు అసమ్మతి నేతలు వెనక్కి తగ్గారు. అయితే, కొన్ని చోట్ల మాత్రం వెనక్కి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ నిరసనల గళం వినిపిస్తుండడం గమనార్హం.

 ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఒత్తిడి 
ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈనెల 5న వనపర్తిలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానుండగా.. అప్పటి లోగా అసమ్మతి పూర్తిగా తగ్గిపోవాలని ఆదేశాల మేరకు ముఖ్యనేతల సంప్రదింపులు ముమ్మరం చేశారు. మక్తల్‌ నియోజకవర్గ ం విషయంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతి గళం వినిపించే వారందరు కూడా ఎంపీ అనుచరగణంగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యం లో ఆదివారం మక్తల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో... పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మో హన్‌రెడ్డిపై అసమ్మతినేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. కొందరు ఏకంగా చిట్టెంను వ్యక్తిగతంగా దూషించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థిపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించినా... పార్టీ ముఖ్యులు ఉపేక్షించడంలో మతలబు ఏమిటని చిట్టెం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగమేఘాల మీద సోమవారం మక్తల్‌ వెళ్లి... అసంతృప్తుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేసీఆర్‌ మాటే వేదంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

కల్వకుర్తిలో తర్జనభర్జన 
రాజకీయ సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే క ల్వకుర్తి విషయంలో అసమ్మతి వర్గం తర్జనభర్జన పడుతోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కసిరెడ్డికి పార్టీ టికెట్‌ ఇస్తే సులువుగా గెలవొచ్చంటూ వారి అనుచరులు పేర్కొంటున్నా రు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసు కుని ముఖ్యనేతలందరితో సంప్రదింపులు చేసి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచిం చారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కూడా మంత్రి కేటీఆర్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ కసిరెడ్డి వర్గం మాత్రం ససేమిరా అంటోంది. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగాలని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నా.. ఆయన వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికీ కసిరెడ్డి వర్గం ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొనకుండా ప్రత్యేక సమావేశాలతో తర్జనభర్జనలు చేస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు