ప్రజాదర్బార్‌కు ప్రత్యేక వ్యవస్థ 

2 Jan, 2020 03:03 IST|Sakshi
బుధవారం రాజ్‌భవన్‌లో నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న గవర్నర్‌ తమిళిసై

గవర్నర్‌ తమిళిసై స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజా సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించి సందర్శకుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు మంచి మనసున్న వాళ్లని, పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా అభివృద్ధి, సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గవర్నర్‌గా వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చానని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇరిగేషన్, వ్యవసాయ, విద్యా రంగాల్లో అభివృద్ధి దిశగా పనిచేస్తోందని నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించారు. 2019లో బతుకమ్మ ఆటలు, గిరిజనులతో మమేకం కావడం సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల తాను సందర్శించిన బోడగూడెం అనే తండాకు చెందిన గిరిజనులను రాజ్‌భవన్‌కు ఆహా్వనించానని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌ గౌడ్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.    

మరిన్ని వార్తలు