తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉధృతం

14 Oct, 2019 04:05 IST|Sakshi

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మాహుతితో భగ్గుమన్న కార్మికులు

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు, సంతాప ర్యాలీలు

సాక్షి, హైదరాబాద్‌: సమ్మెను ఆర్టీసీ కార్మికులు మరింత ఉధృతం చేశారు. సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు భగ్గుమన్నారు. ఆయన మరణవార్త అధికారికంగా వెలువడగానే పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప ర్యాలీలు నిర్వహించారు. కొన్నిచోట్ల ముందస్తు నిర్ణయం మేరకు వంటా వార్పులో కార్మికులు పాల్గొన్నారు. సోమవారం అన్ని డిపోల వద్ద సంతాప సభలు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రధాన డిపోల వద్ద జరిగే కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రత్యక్షంగా ఆర్టీసీ ఆందోళనల్లో పాల్గొంటుండగా మిగతా పార్టీల నేతలు కూడా హజరయ్యేలా ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది.

నేడు గవర్నర్‌కు ఫిర్యాదు...
రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సోమవారం కలవనున్నారు. ఆర్టీసీ విష యంలో ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేయనున్నారు.

వారిది పదవుల వ్యామోహం: ఆర్టీసీ జేఏసీ
టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమతపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. ఉద్యోగుల సంక్షేమం కంటే వారికి పదవుల వ్యామోహమే ఎక్కువని, రాజకీయంగా ఎదిగేందుకు వారు లాలూచీ పడు తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనను సీఎం వద్ద ఉంచారని, అందుకే ఆర్టీసీ కార్మికుల విషయంలో చులకనగా మాట్లాడుతున్నారని జేఏసీ నేత థామస్‌రెడ్డి దుయ్యబట్టారు.

కొనసాగుతున్న సామాన్యుల ఇబ్బందులు...
రోజుకు 8 వేల కంటే ఎక్కువ బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాలకు ఆదివారం వరకు కూడా సరిగ్గా బస్సులు తిరగలేదు. ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాలకే అవి పరిమిత మవుతున్నాయి. తక్కువ సంఖ్యలో ఊళ్లకు బస్సులు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. హైదరాబాద్‌లోనూ సిటీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటోంది. బస్సుల సర్వీసింగ్‌కు కూడా సిబ్బంది లేకపోవడంతో రోజువారీ మెయింటెనెన్స్‌ చేయలేకపోతున్నారు. ఇది బస్సు ఇంజన్లపై ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో చాలా బస్సులు గ్యారేజీకి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రకటన...
ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్న ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర క్లరికల్‌ సిబ్బంది, శ్రామిక్‌లు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన సిబ్బందిని నియమించుకునేందుకు వీలుగా ఆదివారం ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సాధారణ బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో తిప్పుతున్నా ఏసీ బస్సులను మాత్రం తిప్పటం లేదు. వాటిని ప్రత్యేక నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపాల్సి ఉంటుంది. తాత్కాలిక పద్ధతిలో తీసుకుం టున్న డ్రైవర్లలో అలాంటి నైపుణ్యం ఉండదన్న ఉద్దేశం తో వారికి ఏసీ బస్సులు ఇవ్వడం లేదు. ఏసీ బస్సులను నడిపే నైపుణ్యం ఉన్న వారిని కూడా తీసుకోవాలని నిర్ణయించారు.

అలాంటి వారి నుంచి కూడా దరఖాస్తు లు కోరుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది. సాధారణ బస్సులు నడిపే వారికి రోజుకు రూ. 1,500, వోల్వో లాంటి బస్సులు నడిపేవారికి రూ. 2,000 చెల్లించ నున్నట్లు వెల్లడించింది. ఐటీ నిపుణులకు రూ. 1,500, రిటైర్డ్‌ సూపర్‌వైజరీ కేడర్‌ సిబ్బందికి రూ. 1,500 చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. సమ్మెలో ఉన్న వారి స్థానంలో కొత్త నియామకాలు పూర్తిచేయనుంది. సగం బస్సులు మాత్రమే ఆర్టీసీవి ఉంటాయని ఇప్పటికే సీఎం వెల్లడించిన మీదట సంస్థకు 24 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అధికారులు తేల్చారు.

శ్రీనివాస్‌రెడ్డి కన్నుమూత
చార్మినార్‌/సంతోష్‌నగర్‌: ఆత్మహత్యకు యత్నించి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ కుమారుడు అభిరాంరెడ్డికి అప్పగించారు. శ్రీనివాస్‌ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వీరంతా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు బైఠాయించిన నాయకులను వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తెలుసుకుని ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎంపీ వీహెచ్, జేఏసీ నాయకులు థామస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ రేవంత్‌రెడ్డి, మంద కృష్ణమాదిగ, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకొని శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఖమ్మంలో ఉద్రిక్తత... 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: శ్రీనివాస్‌రెడ్డి మృతి విషయం కార్మిక వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో దావానలంలా వ్యాపించడంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కార్మికుల కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీనివాస్‌రెడ్డి త్యాగం ఊరికే పోనివ్వమని, ప్రభుత్వంపై మరింత పట్టుదలగా పోరాడుతామని ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు, పలు రాజ కీయ పక్షాల నేతలు చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఆదివారం భారీ పోలీస్‌ బందోబస్త్‌ నడుమ రాపర్తినగర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు.

పోరుకు భట్టి, ప్రధాన పక్షాల పిలుపు.. 
శ్రీనివాస్‌రెడ్డి మృతితో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, ఎన్డీ చంద్రన్నవర్గం నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తిగా మరింత పోరు జరపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క, పలు ప్రధాన రాజకీయ పక్షాల నేతలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.

మరిన్ని వార్తలు