సత్యనారాయణ వ్రతం కోసం వెళ్లి..

17 Nov, 2014 02:35 IST|Sakshi
సత్యనారాయణ వ్రతం కోసం వెళ్లి..

చెన్నూర్ : సత్యనారాణయ వ్రతం కోసం వెళ్లిన అన్నాతమ్ముడు గోదావరిలో నీట మునిగి చనిపోయిన సంఘటన చెన్నూర్‌లో విషాదాన్ని నింపింది. ఓ చిన్నారిని కాపాడి తన కొడుకులను రక్షించుకుకోలేకపోయిన ఆ తండ్రి గుండె విలవిల్లాడింది. ‘స్వామి వత్రం కోసం వస్తే మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన పేరాల రామారావు స్థానిక అభయాంజనేయ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు.

రామారావు ప్రజావైన్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావు ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న ఆర్యవైశ్యులు పట్టణ సమీపంలోని గోదావరి నదిలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతానికి వీరిని ఆహ్వానించడంతో రామారావు, భార్య లావణ్యతోపాటు ఇద్దరు కుమారులు సాయికృష్ణ (11), సాయి వర్షిత్ (6) వెళ్లారు. అక్కడి వెళ్లిన రామారావు పిల్లలతో గోదావరి స్నానాలు చేస్తున్నారు. వీరికి కొంత దూరంలో కొంత మంది చిన్నారులు స్నానాలు చేస్తున్నారు. అందులోంచి ఓ చిన్నారి గోదావరిలో మునిగిపోతుండగా రామారావు పరుగెత్తుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు వచ్చి చూసే సరికి తన కొడుకులు ఇద్దరు కన్పించలేదు.

తండ్రి వెంటనే వెళ్లిన సాయికృష్ణ (11), సాయివర్షిత్(6) గోదావరి నదిలో గల్లంతయ్యారు. చిన్నారులు గల్లంతైన ప్రదేశం లోతుగా ఉండడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. సత్యనారాయణ స్వామి వత్రాలను చూసేందుకు వస్తే ఆ స్వామి మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా అంటూ తల్లి లావణ్య రోధించిన తీరు పలువురిని కలచివేసింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శివప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్‌రావు సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సాయికృష్ణ స్థానిక ఎస్‌జీబీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి, సాయివర్షిత్ ఎల్‌కేజీ చదువుతున్నారు.

బంధువుల ఆందోళన
సత్యనారాయణ వత్రాలు నిర్వహించే సమీపంలోనే ఇద్దరు చిన్నారులు మృతి చెంది బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తుంటే పూజలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని మృతుల బంధువులు గోదావరి తీరం వద్ద ఆందోళన చేశారు. వెంటనే పూజలు నిలిపివేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పారు.

మరిన్ని వార్తలు