గాంధీభవన్‌లో ఘనంగా ఉగాది

7 Apr, 2019 03:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ‘వికారినామ సంవత్సరానికి రాజు శని. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయి. పాలకుల మధ్య వైరం ఉంటుంది. పాలకులు, ప్రజలు రోగాలతో బాధపడతారు. పంటలు స్వల్పంగా పండుతాయి. దేశం, రాష్ట్రంలో పాలకులు, ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రజలకు మేలు జరగదు. దేశం, రాష్ట్రంలో అస్థిర రాజకీయ వాతావరణం ఉంటుంది.

దేశ ఆదాయం 45 కాగా ఖర్చు 65గా ఉంటుంది. ఆర్థిక వనరులు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. స్వదేశీ పారిశ్రామిక కంపెనీల్లో నకిలీ ఔషధాలు బయటపడతాయి. సాంకేతిక, సమాచార రంగంలో నూతన పోకడలతో యువత ప్రమాదాలను ఎదుర్కొంటారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కుమార్‌ రావు, కోదండరెడ్డి, వినోద్‌కుమార్, వినోద్‌ రెడ్డి, జి.నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు