ఉప సర్పంచ్‌లకు నిరాశే.. 

16 Mar, 2019 13:58 IST|Sakshi

తాత్కాలికంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకే చెక్‌ పవర్‌ ? 

జాయింట్‌ చెక్‌ పవర్‌పై ప్రభుత్వం పునరాలోచన   

ప్రభుత్వం నుంచి సమాచారం లేదంటున్న జిల్లా అధికారులు 

ఎన్నికలు ముగిసి రెండు నెలలు దాటినా పల్లెల్లో అభివృద్ధి శూన్యం

సాక్షి, భూపాలపల్లి: నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలులోకి వచ్చే వరకు కార్యదర్శి, సర్పంచ్‌కు ఉమ్మడి చెక్‌ పవర్‌ కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు దాటినా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చెక్‌పవర్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది.

నిధులు ఉన్నా ఖర్చుపెట్టలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికైతే పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌ పవర్‌ను కల్పించనుంది. అయితే ఇన్నాళ్లుగా చెక్‌పవర్‌పై ఆశలు పెట్టుకున్న ఉపసర్పంచ్‌లు నిరాశలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రాకున్నా ఉపసర్పంచ్‌ పదవి కొసం కొంత మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. 

తాత్కాలికమేనా.. 
జీపీల్లో చెక్‌ పవర్‌ సర్పంచ్, కార్యదర్శులకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది తాత్కాలికమా, లేక ఇలాగే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని 415 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లకు పవర్‌ లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఉమ్మడి చెక్‌పవర్‌పై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలికంగా చెక్‌పవర్‌ ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గ్రామాల్లో నిలిచిన బకాయిలు, బిల్లులు చెల్లించేందుకు మాత్రమే తాత్కాలికంగా సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్‌ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఉపసర్పంచ్‌లు అనుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని చాలా మంది డీపీఓలు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికే ఉమ్మడి చెక్‌ పవర్‌ ఉంటే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.  

నిరాశలోనే.. 
ఇన్నాళ్లు చెక్‌ పవర్‌తో పవర్‌ వస్తుందనుకున్న ఉపసర్పంచ్‌లకు నిరాశే ఎదురుకానుంది. రెండు జిల్లాల్లో ఉన్న 415 పంచాయతీల్లో సర్పంచ్‌ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు కూడా  అదే స్థాయిలో తీసుకున్నారు. చెక్‌పవర్‌ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉంటుందని ఈసారి చాలా మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కొన్ని చోట్ల సర్పంచ్‌ల కంటే ఉపసర్పంచ్‌ పదవి కోసం ఎక్కువ ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. కొంత మంది రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఉపసర్పంచ్‌ పదవి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రస్తుతం చెక్‌పవర్‌ పై స్పష్టత లేకపోవడం ఉపసర్పంచ్‌లు ఆందోళనలో ఉన్నారు.   

సమర్థ నిర్వహణకే.. 
ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ కల్పించే ఆంశంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయితీరాజ్‌ చట్టం–2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌కు సమష్టిగా చెక్‌ పవర్‌ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన పంచాయితీరాజ్‌ చట్టానికి గతేడాది ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయం అములు విషయంలో సర్కారు ఆచితూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అధికారాలు ఇరువురు ప్రజాప్రతినిధులకు కట్టబెట్టడం వల్ల విధుల దుర్వినియోగం జరుగుతుందని, రికార్డుల నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోందని పంచాయితీరాజ్‌ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా లావాదేవీల్లో అధికారులను బాధ్యులను చేయడం కూడా కుదరదని తేల్చింది.

మరోవైపు పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషించే కార్యదర్శుల కస్టడీలో రికార్డులు ఉంటాయని, ఈ తరుణంలో నిధుల వినియోగంలో వారికి బాధ్యతలు అప్పగిస్తే నియంత్రణ కష్టమని పంచాయతీరాజ్‌ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం దృష్టికి  తెచ్చింది. చెక్‌పవర్‌ను వారికి కల్పించి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామనే నిర్ణయం సరికాదని  అభిప్రాయపడింది. ఈ వాదనతో ఏకీభవించిన పంచాయితీరాజ్‌ శాఖ, గతంలో ఉన్న మాదిరే సర్పంచ్, కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ కల్పించే దిశగా ఆలోచన చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.  

ఎటువంటి సమాచారం రాలేదు 


– చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి 
సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయంట్‌ చెక్‌ పవర్‌ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.

మరిన్ని వార్తలు