ఓటుహక్కును వినియోగించుకున్నారా..

16 Nov, 2018 08:37 IST|Sakshi

2014 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓటర్లు 25,31,556 

ఓటుకు దూరంగా 4,83,654 మంది, వినియోగించుకుంది 20,47,902 మంది

ప్రస్తుతం దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలకు 100 శాతం లక్ష్యంగా ఏర్పాట్లు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 4లక్షల 83వేల 654 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో  25లక్షల 31వేల 556 ఓటర్లు ఉండగా  20లక్షల 47వేల 902 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వినియోగించుకోని వారు స్థానికంగా లేరా.. వినియోగించుకునేందుకు సమయం లేదా.. ఒక్కరికి రెండేసి ఓట్లు ఉండటంతో ఒకటే వినియోగించుకున్నారా.. ఇవన్నీ బోగస్‌ ఓట్లా అనేది అధికారులకు అంతుపట్టని విషయం. 2014లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాగా ఉన్నది ప్రస్తుతం వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఈ సారి ఓటు హక్కు అందరూ వినియోగించుకునేందకు జిల్లా ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.     

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : ఓటుహక్కును అందరూ వినియోగించుకునేలా జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి తొలి సారిగా ఈవీఎంలకు వీవీ ప్యాట్‌లను అనుసంధానం చేశారు. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో కనపడే విధంగా ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.  ఓటర్లకు, రాజకీయ నాయకులకు అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు మూడు దశల్లో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. 100 శాతం ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు
గతంలో  దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ఓటుహక్కును వినియోగించుకునేందుకు  కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీసుకెళ్తే తప్ప ఓటు వేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎన్నికల సంఘమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దివ్యాంగులతో ఓటు వేయించే బాధ్యతను ఎన్నికల సంఘం బూత్‌ల వారీగా అధికారులకు అప్పగించింది. దివ్యాంగులకు వీల్‌ చైర్‌లు, ర్యాంప్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయా జిల్లాలో పోలింగ్‌కేంద్రాల వద్ద ఏమేమి అవసరాలు ఉంటాయో అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరిగే నాటికి మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు మౌలిక సదుపాయాల గురించి ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్లు, నీటిసౌకర్యం కల్పించాలన్నారు. ఈ సారైనా ఓటుహక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందా చూడాలి.  

మరిన్ని వార్తలు