మలేరియా శాఖకు ఖాళీల సుస్తీ

4 Aug, 2014 03:56 IST|Sakshi

ఉట్నూర్ : జిల్లా మలేరియా కార్యాలయానికి ఖాళీల గ్రహణం పట్టింది. అసలే వ్యాధుల సీజన్ కావడంతో గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయంలోనే కాక జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయి సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పడుతోంది. ప్రధాన కార్యాలయం లో 17 వరకు ఖాళీలుండగా జిల్లావ్యాప్తంగా వివిధ స్థాయిల్లో 307 వరకు ఖాళీలున్నాయి. ప్రభుత్వం ఈ ఖాళీలపై దృష్టి సారిస్తే తప్పా జిల్లాలో విస్తరిస్తున్న మలేరియా పాజిటివ్ కేసులకు అదుపులోకి తీసుకువచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీనికి తోడు దోమ తెరల జాడే లేకుండా పోవడం ముఖ్యంగా ఏజెన్సీ గిరిజనుల పాలిట శాపంగా మారింది.

 వెక్కిరిస్తున్న ఖాళీలు
 జిల్లా మలేరియా ప్రధాన కార్యాలయం ఏజెన్సీ కేంద్రంగా ఉట్నూర్‌లో ఉంది. ఈ కార్యాలయం లో అన్ని స్థాయిలో కలిపి 33 పోస్టులుండాలి. కానీ ప్రస్తుతం కార్యాలయంలో 17 ఖాళీలున్నాయి. ఏఎంవోలు రెండు, హెచ్‌ఈవో, ఎస్‌ఎఫ్‌డబ్ల్యూ, ఎంవో, కార్యాలయ డ్రైవర్, క్లీనర్స్, ఫీల్డ్ వర్కర్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీలుండగా ల్యాబ్ టెక్నీషియన్ 03, ల్యాబ్ అటెన్‌డెడ్ 02, ల్యాబ్ టెక్నీషియన్ 04 ఖాళీలున్నాయి. ఇక జిల్లావ్యాప్తంగా మరో 307 ఖాళీలున్నాయి.

జిల్లాలో 304 ఎంపీహెచ్‌ఏ(పురుష) సిబ్బందికి గానూ కేవలం 105 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా మరో 189 ఖాళీలున్నాయి. ఇక ఏజెన్సీ పరిధిలో 88 మంది ఎంపీహెచ్‌ఏ(పురుష) సిబ్బందికి గానూ ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. జిల్లాలో 33 సబ్ యూనిట్ అధికారులకు గానూ 33 ఖాళీలున్నాయి. ఏజెన్సీ పరిధిలో 17కు గానూ ఐదు ఖాళీలున్నాయి. ఇలా దాదాపు జిల్లా మలేరియా శాఖలో 324 ఖాళీలుండటంతో దోమల నివారణకు అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా పోతున్నారు.

 దోమతెరలకు ఎదురుచూపు
 మలేరియా నివారణకు 2008 నుంచి జిల్లాలో ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా దోమతెరల పంపిణీ చేపట్టింది. అప్పట్లో దాదాపు 84 వేల తెరలను పంపినీ చేశారు. తర్వాత ఆరేళ్లు గడుస్తున్నా దోమతెరల ఊసే లేకపోవడంతో గిరిజనంతో పాటు జిల్లావాసులు దోమకాటుతో మలేరియా, డెంగీ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వారం క్రితం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్.. దోమతెరలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లా ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు దోమతెరలు అందుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

 పెరుగుతున్న పాజిటివ్ కేసులు
 గతంతో పోల్చితే మలేరియా పాజిటివ్ కేసులు జిల్లాలో పెరుగుతున్నాయి. దోమతెరలు లేక జిల్లాలో ప్రజలు అల్లాడుతున్నారు. 2007లో 2,165 కేసులు, 2008లో 1,882, 2009లో 614, 2010లో 612, 2011లో 1,162, 2012లో 707, 2013లో 995 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో ఏజెన్సీలో అత్యధికంగా 692 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం జూలై 20 తేదీ వరకు 220 పాజిటివ్ కేసులు నమోదు కాగా 161 గిరిజన ప్రాంతాల్లోనివే కావడం కలవరానికి గురి చేస్తోంది. మలేరియా శాఖలో భారీగా ఖాళీలు ఉండటంతో పూర్తిస్థాయిలో చికిత్సలు అందించడం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారం అవుతోంది. అదీ కాక జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉండటంతో సిబ్బంది దూర ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.

 కొనసాగుతున్న ఐఆర్‌ఎస్ స్ప్రే
 జిల్లాలో గుర్తించిన 869 గ్రామాల్లో మొదటి విడుత దోమల నివారణ మందు పిచికారీ (ఐ ఆర్‌ఎస్-ఇండోర్ రెసిడెన్షియల్ స్ప్రే) ఆగ్టు 30 వరకు కొనసాగనుంది. రెండో విడత అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 15 వరకు చేయనున్నా రు. ఎక్కడ మలేరియా పాజిటివ్ కేసు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారు లు కోరుతున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రత ని వారణకు క్షేత్ర స్థాయిలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ, వైద్య అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు