వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి

15 Jun, 2015 04:33 IST|Sakshi
ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన వడ్డెర సంఘం మహాసభలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

- ఓట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకటేశ్ మౌర్య డిమాండ్
 
సాక్షి, హైదరాబాద్:
బాలకృష్ణ రణకే కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలని.. వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని ఓట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకటేశ్ మౌర్య డిమాండ్ చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ వడ్డెర్ల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మౌర్య మాట్లాడుతూ 2005లో కేంద్రం బాలకృష్ణ రణకే కమిషన్ నియమించి వడ్డెరల జీవనస్థితులు అధ్యయనం చేసి కమిటీ 2008లో తన నివేదికను సమర్పిస్తూ.. వడ్డెరలతో సహా విముక్త సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసిందని తెలిపారు.

వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చేందుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయలో వడ్డెర్లకు 33 శాతం పనులు కేటాయించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. వడ్డెరల బతుకుల గురించి ఆలోచించే పాలకులు కరువయ్యారని ఓసీసీఐ చైర్మన్ శంకర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు వడ్డెరల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఓసీసీఐ జనరల్ సెక్రటరీ లాల్‌చంద్ కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్పీ నేత కె.లక్ష్మణ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, విమలక్క కార్యక్రమంలో పాల్గొని వడ్డెర్లకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వడ్డెర్ల మహాసభ జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్, జాతీయ గౌరవాధ్యక్షుడు రూపాని లోకనాథం, జాతీయ ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు మొగిలి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి మారయ్య, ఓసీసీఐ నేత మనోహర్ ముగోల్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు