వాహన రిజిస్ట్రేషన్‌లో ఆధార్‌ తప్పనిసరి

10 Aug, 2017 03:33 IST|Sakshi
వాహన రిజిస్ట్రేషన్‌లో ఆధార్‌ తప్పనిసరి

వివరాలు రవాణాశాఖ వెబ్‌సైట్‌లోనూ ఉంచాలి
మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీలలో ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. వాహనాలను ఇతరులకు అమ్మినప్పుడు అవి కొన్నవారి పేరుపైకి బదిలీకావాల్సి ఉందని, కానీ ఇది జరగకపోవటం వల్ల బీమా పొందడం, పోలీసు కేసులు లాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి, కొన్నవారి పేరుపై వాహనాలు బదిలీ అయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో రవాణా, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, లారీలు, ఆటోల ఫైనాన్షియర్లు తమ డబ్బులు కట్టలేదన్న ఉద్దేశంతో వాహనాలను లాక్కెళ్లి ఇతరులకు అందజేస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో పాతవారి పేరిటే వాహనాలు ఉన్నందున ప్రమాదాల సమయంలో చిక్కులు ఏర్పడుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్, విక్రయాల వివరాలను సైతం రవాణాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఫైనాన్షియర్ల ఆగడాల నుంచి ఆటోవాలాలను రక్షించాలని, వారి ఆటోలను వారిపేరిటే రిజిస్ట్రేషన్‌ చేయించాలని సూచించారు. నగరంలో వాహన ప్రమాదాలు, మరణాల రేటు తగ్గిందని నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీలు రఘునాథ్, పాండురంగనాయక్, డీటీసీ ప్రవీణ్‌రావు, ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు