కిటకిటలాడుతున్న దేవాలయాలు

18 Oct, 2018 13:40 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు  చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. అలాగే 100, 300 రూపాయల టికెట్ల విక్రయం రద్దు చేశారు. భక్తులను సాధారణ క్యూలైన్లతో పాటు ముఖ మండప దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

దసరా సందర్భంగా కొండగట్టుపై భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులకు అంజన్న దర్శనమిచ్చారు. దసరా సందర్భంగా తమ వాహనాలకు పూజలు చేయించడానకి వాహనదారులంతా కొండగట్టుకు క్యూ కట్టారు. పోలీసులు ట్రాఫిక్‌ అంక్షలు విధించారు. 

వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా  నిజరూప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసుల ట్రాఫిక్‌ అంక్షలు విధించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా శతచండీయాగం జరిగింది. సిద్దిరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం శమీపూజకు యోగా, ఉగ్ర వెంకటేశ్వర స్వామి రానున్నారు. 

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వెంకటేశ్వరస్వామి శేషవాహనసేవను నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శమీపూజ, 6.30కు తుంగభద్ర నదీ హారతి ఉండనుంది. రాత్రి 7 గంటలకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వాళ్లకు తెప్పోత్సవం జరగనుంది. 

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిదా(మహాలక్ష్మీ) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం పూర్ణాహుతితో నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి.

బాసరలో మహర్నవమి సందర్భంగా సరస్వతీ యాగం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ చేశారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నివేదన ఉండనుంది. సాయంత్రం 4 గంటల నుంచి పురవీధుల్లో అమ్మవారి రథోత్సవం, సాయంత్రం 6.30 కు ఆలయం ముందు శమీ పూజ ఉండనుంది. 


 

మరిన్ని వార్తలు